రిషభ్ పంత్ భారత క్రికెట్లో ఓ సూపర్ స్టార్ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'నెరోలాక్ క్రికెట్ లైవ్' షోలో పాల్గొన్న కెవిన్ పీటర్సన్... అపారమైన ప్రతిభ రిషబ్ పంత్ సొంతమని వ్యాఖ్యానించాడు. పీటర్సన్ మాట్లాడుతూ "పంత్ చిన్నవాడు. అపారమైన ప్రతిభ అతడి సొంతం. ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇండియా తరుపున ఆడుతూ తన కల కోసం జీవిస్తున్నాడు. కానీ, అతడి చుట్టూ విమర్శకులు ఉన్నారు. అతడి వయసు 21 (22). ఐపీఎల్ నుంచి అతడిని పరిశీలిస్తున్నా. చేసిన పొరపాటునే పంత్ పునరావృతం చేస్తున్నాడు" అని అన్నాడు. "చేసిన తప్పుల నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాలి. పంత్ వయస్సు 22 ఏళ్లు అంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నా. అతడికి 24-25 ఏళ్లు ఉంటాయని భావించా. ప్రస్తుతం అతడికి పరిణితి చెందడానికి కొంత సమయం ఇవ్వాలి. అతడికి 27-30 ఏళ్లు వచ్చే సరికే అతడిలో అసలైన ఆట వెలుగు చూస్తుంది" అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. "అతను చేసిన అన్ని తప్పిదాలు, అతడిపై ఉన్న నమ్మకంతో ఆటు జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు రిషబ్ పంత్ కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడు" అని పీటర్సన్ తెలిపాడు. మరోవైపు విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయన్ లారా కూడా పీటర్సన్ అభిప్రాయంతో ఏకీభవించాడు.