ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 10:25 AM

కిచకిచమంటూ ప్రేమతో అరుస్తూ, ముక్కున పీచు పట్టుకుని ఆత్మీయుల్లా ఇంట్లోకి వచ్చే పిచ్చుకలు మచ్చుకైనా ఎక్కడా కనపడటం లేదు. రివ్వురివ్వున ఎగిరే ఆ పిట్టలను చూస్తే అందిరికీ ఆనందమే. చెట్లన్నీ ఆ గిజిగాడి గూళ్లతో ఎంతో అందంగా కనిపించేవి. పర్యావరణానికి మేలు చేసే పిచ్చుకలు ఏమైనట్లు? వాటిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.


పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఎన్నో తరాలకు పిచ్చుకలు ప్రియమైన నేస్తాలు. పెరట్లో, ఇంట్లో స్వేచ్ఛగా తిరుగాడుతూ సందడి చేసేవి. గుప్పెడు గింజలు వేసి మచ్చిక చేసుకునేందుకు ఇంటిల్లిపాది పోటీపడేవారు. గిజిగాడు గూళ్లను చూసి, ఇసుకతో గూళ్లను కట్టే బాల్యం మరువతరమా. కానీ పెరుగుతున్న కాలుష్యం, వ్యవసాయంలో పురుగుల మందు వాడకం, సెల్‌టవర్‌ రేడియేషన, తరిగిపోతున్న వృక్షాలు, ఆహార కొరత, వాతావరణంలో మార్పులు వల్ల ఆ చిన్ని ప్రాణాలకు ముప్పువాటిల్లింది. వాటి గూళ్లు చెదిరిపోయాయి, ఆ ప్రాణులు కనిపించకుండా వెళ్లిపోయాయి. రోజురోజుకు వీటి సంఖ్య తగ్గిపోతుండటంతో అంతరించే పక్షుల జాబితాలో చేరుతున్నాయి.


ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. జీవవైవిద్యం, పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందరికీ తెలియజెప్పేందుకే ప్రతి సంవత్సరం ప్రపంచ పిచ్చుకల (మార్చి 20) దినోత్సవాన్ని వివిధ దేశాల్లో జరుపుతున్నారు. యూరప్‌, ఫ్రాన్స, ఆస్ర్టేలియా, భారతలతో పాటు 50 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు గొంతెత్తి ___సేవ్‌ ది స్పారో అంటూనినదిస్తున్నారు.


ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.


ఇలా రక్షించుకుందాం.


కిటికీలు, వెంటిలేటర్‌, డాబాలు, చెట్లు, వరండాల్లో కృత్రిమ గూళ్లను ఉంచి వాటికి ఆశ్రయం కల్పించడం ద్వారా కొంతవరకు వాటిని సంరక్షించవచ్చు. ఇంటి బయటా, బాల్కనీ, మేడపైన గుప్పెడు జొన్నలు, సజ్జలు, బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను వెదజల్లి వాటి ఆకలిని తీర్చండి. పాఠశాల, కార్యాలయాలు, ఇళ్లు, పార్కులు, సినిమా హాళ్లలో చిన్న నీటి తొట్టెల్లో నీళ్లు పోసి ఉంచండి. ఈ నీటి తొట్లను రసాయనాలు కలిసిన సబ్బులు, సర్ఫ్‌లతో శుభ్రం చేయకూడదు. ఇంటి ఆవరణలో, ప్రభుత్వ ఆఫీసుల్లో, ఇతర ప్రదేశాల్లో చెట్లను పెంచండం వల్ల వీటిని రక్షించుకోవచ్చు


స్పారో ఫ్యాక్స్ట్‌ మొత్తం 35 రకాలు పిచ్చుక జాతులున్నాయి. పిచ్చుకలు ఈత కూడా కొడతాయి. శత్రు పక్షుల నుంచి రక్షించుకోవడానికే అవి నీళ్లలో ఈదుతాయి. పిచ్చుకలు గంటకు దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. పిచ్చుకల జీవిత కాలం 4 నుంచి 5 సంవత్సరాలు.


పిచ్చుక అవార్డులు పిచ్చుకల సంరక్షణ చేయుటకు గానూ ప్రజలకు ప్రోత్సహించుటకుగానూ ఎన్. ఎఫ్. ఎస్ సంస్థ మొదటిసారి పిచ్చుకల అవార్డులను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో మార్చి 20, 2011 న ప్రారంభించింది.


పిచ్చుకలను సంరక్షిద్దాం.
ప్రకృతిని పరిరక్షించుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com