డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి అందరూ ATM కార్డు వాడుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఏటీఎం ఆధారంగా భారీ మొత్తంలో ఆర్థికపరమైన నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
చాలామంది తమ ఏటీఎం కార్డు పిన్ నెలలు సంవత్సరాల తరబడి మార్చకుండా అలాగే ఉంచుతారు. ఇది చాలా ప్రమాదకరం. కచ్చితంగా తరచూ పిన్ మార్చుకుంటూ ఉండండి. అలాగే ఏటీఎం మిషన్ లో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళినపుడు, పిన్ ఎంటర్ చేసే కీపాడ్ సీక్రెట్ కెమెరాలకు కనిపించకుండా చేతులు అడ్డు పెట్టండి. మరికొంతమంది తమ పిన్ ఎక్కడో ఒక చోట రాసి పెడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఇలా చేయకండి. మీ ఎటిఎం కార్డ్ పిన్ గుర్తుపెట్టుకోండి.
అలాగే కొంతమంది తమ పుట్టిన తేదీ, సంవత్సరాలను ఏటీఎం పిన్ గా వాడుతూ ఉంటారు. ఇలా చేసినప్పుడు చాలా సులభంగా ఫ్రాడ్ చేయొచ్చు. కాబట్టి సంక్లిష్టమైన పిన్ సెట్ చేసుకోండి. దీంతోపాటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా మారినట్లు అయితే వెంటనే మీ బ్యాంకులో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ లావాదేవీలు జరిగితే ఆ విషయం మీ దృష్టికి వస్తుంది. బ్యాంకుల నుండి కాల్ చేస్తున్నామని ఎవరైనా మీ డెబిట్ కార్డ్ వివరాలు అడిగినా, ఓటిపి చెప్పమన్నా ఎట్టి పరిస్థితుల్లో స్పందించకండి. అలా చేసిన అనేక మంది అమాయకులు తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకున్నారు.
అలాగే ఏటీఎం మిషన్ లో మీరు డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు మీ వెనక నుండి ఎవరైనా నిలబడి మీ పిన్ తెలుసుకుంటున్నారేమో పరిశీలించండి. ఈ తరహా మోసాలు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యాయి. ఏటీఎం మిషన్ల నుండి డబ్బులు విత్ డ్రా చేసుకునే టప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు అందిస్తున్న YONO వంటి ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్లు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. పలు రకాల ఆఫర్ల పేరిట ఆన్లైన్ లో ఏమైనా లింకులు వస్తే, వాటిలో ఎట్టి పరిస్థితుల్లో మీ డెబిట్ కార్డు వివరాలు ఇవ్వకండి.