ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో ఉచితాలపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:42 PM

ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే ఉచితాలను లంచాలుగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఉచితాలపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన లాయర్ శశాంక్ జే శ్రీధర దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. లోక్‌సభ, అసెంబ్లీ సహా ఇతర ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.


ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరారు. అంతేకాకుండా ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఉచితాలపై గతంలో దాఖలైన వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు వెంటనే కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పేర్కొన్నారు. పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయకుండా కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


  ఎన్నికల సమయంలో పార్టీలు తమ గెలుపు కోసం ఇచ్చే ఉచిత హామీల కారణంగా ఆయా ప్రభుత్వాల ఖజానాపై మోయలేని భారం పడుతోందని తన పిటిషన్‌లో లాయర్ శశాంక్ జే శ్రీధర తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్.. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసులతో కలిపి విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి తాజాగా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకులు ప్రకటించే ఉచిత వాగ్దానాలు.. ఎన్నికల్లో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. అంతేకాకుండా ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com