డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదని నేపాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు స్పష్టం చేసింది. అత్యాచారం, హత్యాయత్నం కేసులలో 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను శిక్ష ఖరారైన తరువాత పంచకుల కోర్టు వద్ద తప్పించేందుకు ప్రయత్నించిన కేసులో హనీ ప్రీత్ కౌర్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. గుర్మీత్ సింగ్ జైలు పాలైన క్షణం నుంచీ పరారీలో ఉన్న హనీ ప్రీత్ కౌర్ కోసం హర్యానా, పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు. ఆమె నేపాల్ పారిపోయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో నేపాల్ సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ ఆమె తమ దేశంలో లేదని స్పష్టత ఇచ్చింది. కొందరు ఆమెను బిరాట్ నగర్ లో చూశామనీ, మరి కొందరు నేపాల్ పశ్చిమ ప్రాంతంలో తలదాచుకుందని అంటున్నారు, ఇంకొందరు హనీ ప్రీత్ కౌర్ ఖాట్మండులో కూడా కనిపించిందని చెబుతున్నారు. అయితే అవన్నీ అవాస్తవాలు, ఆమె నేపాల్ లో లేదు అని నేపాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు విస్పష్టంగా పేర్కొంది.