ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూకాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 04:52 AM

- ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు


- జూన్‌ 2 నాటికి పొగ రహిత రాష్ర్టంగా ఏపి 


- ఈ పోస్‌ విధానం ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ 


- ఆర్థిక ఇబ్బందులున్నా పథకాల అమలులో రాజీయే లేదు 


- అధికారుల సమీక్షలో మంత్రులు శిద్ధా, పత్తిపాటి 


  ఒంగోలు, మేజర్‌న్యూస్‌ : వినియోగదారులకు పంపిణీ చేసే సరుకులు, వస్తువులకు సంబంధించి తూనికలలో తేడాలు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ప్రకాశం భవనంలోని సీపీవో సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా దీపం పథకం, పౌ సరఫరాలుపై మూడు డివిజన్ల రెవెన్యూ అధికారులు, మండల తహశీల్ధార్లు, ఆహార సలహా సంఘాలు, వినియోగదారుల సంఘాలు, రేషన్‌షాపు డీలర్లు, గ్యాస్‌ ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డుదారులందరికి వేయి రూపాయలకే గ్యాస్‌ కనెక్షన్‌ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని గృహాలన్నింటికి గ్యాస్‌ కనెక్షన్‌ సమకూర్చి జూన్‌ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పొగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 


  రాష్ట్రంలో పలు వస్తువులు, సరుకులు విషయంలో తూనికలలో షార్టేజి వస్తున్నాయని చర్చ జరుగుతుందని, ఈవిషయంపై ప్రభుత్వం తూనికలు, కొలతలు శాఖ ద్వారా తనిఖీలు చేపట్టి వినియోగదారులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఒంగోలు పట్టణ పరిధిలో గ్యాస్‌ ఏజెన్సీ గోడౌన్‌, ఎరువుల గోడౌన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టామని, గ్యాస్‌ సిలిండర్‌ తూకంలో ఎటువంటి తేడా లేదని, ఎరువు బస్తాకు సంబంధించి 7 వందల గ్రాములు తగ్గుదల గుర్తించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. క్షేత్ర స్ధాయిలో మండల స్ధాయి స్టాక్‌ పాయింట్‌ నుంచి రేషన్‌షాపు డీలర్లకు వెళ్లే సరుకులతో వృత్యాసాలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చిందన్నారు. వాటిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ తూనికలు, కొలతలు శాఖ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


జిల్లాలో 9 లక్షల 42 వేల 253 రేషన్‌ కార్డులుండగా మే నెలలో ఇప్పటి వరకు 6 లక్షల 89 వేల 114 మంది ఈ పాస్‌ విధానం ద్వారా సరుకులు తీసుకోవడం జరుగుతుందని ఇంకా 26 శాతం మంది రేషన్‌ కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 


దీపం పథకం క్రింద బిపిసి, హెచ్పిసి, ఐఓసీ, కంపెనీల ద్వారా 2 లక్షల 5 వేల 137 గ్యాస్‌ కనెక్షన్లు లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి గ్యాస్‌ ఎజెన్సీ ప్రతినిధులకు సూచించారు. గ్యాస్‌ ఏజెన్సీలు బాధ్యతగా వ్యవహరించి వంద శాతం దీపం పథకం గ్రౌండింగ్‌ చేపట్టాలన్నారు. కిరోసిన్‌ కోటాను జూన్‌ మాసం నుంచి కోత విధించే అవకాశం ఉందని, జూన్‌ 2వ తేదీ నాటికి గ్యాస్‌ లేని ఇల్లు ఉండకూడదన్నారు. 


రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్ధారాఘవరావు మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వస్తువుల్లో తూకాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధనలో గ్యాస్‌ ఏజెన్సీలు, రేషన్‌ షాపు డీలర్లు సహకరించాలన్నారు. వినియోగదారులకు సంబంధించి చట్టాలు, హక్కులుపై అవగాహన కల్పించాలని అదే విధంగా చైతన్య పరచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫా అందించడం జరగుతోందన్నారు. ప్రతీ 3 నెలల కొకసారి ఆహార సలహా సంఘాలు, వినియోదారుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేలా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందించే ఏర్పాట్లు చూడాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ చేసే కార్యక్రమాలు అందరూ  సహకరించాలని సూచించారు. 


సమావేశంలో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ డైరెక్టరు యం శ్రీధర్‌ మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేఏ వారు వినియోగదారుల నుంచి బిల్లులకంటే అధనంగా రూ 30 వసూలు చేస్తున్నామని, ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మెషిన్లతో మోసాలు చేస్తున్నారని, సినిమా థియేటర్లలో అధిక ధరలతో సినిమా టిక్కెట్లు అమ్మకాలు జరుగుతున్నాయని, సినిమా హాల్లో తినుబండారాలు అధిక రేటులో అమ్ముతూ వినోదం కొరకు వచ్చే వారిని దోచుకుంటున్నారని, మరుగుదోడ్లు సక్రమంగా నిర్వహించడం లేదన మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. 


 


పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ మార్టూరు, యద్దనపూడి మండలాల్లో 3 వేల 5 వందల గ్యాస్‌ కనెక్షన్లు పెండింగ్‌ ఉన్నాయని వాటిని త్వరితగతిన గ్రౌండింగ్‌ చేపట్టేలా చూడాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వేలి ముద్రలు పడని రేషన్‌ కార్డుదారులకు విఆర్‌ఓ ఆధారిటికేషన్‌ ద్వారా నిత్యావసర సరులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని జేసి మంత్రులకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డీవోలు శ్రీనివాసరావు, మల్లిఖార్జున, కొండయ్య, డీఎస్‌వో, టి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లైయి డీఎం, మండల తహసీల్ధార్లు, ఆహార సలహా సంఘం సభ్యులు, వినియోగదారుల సంఘం సభ్యులు, రేషన్‌ షాపు డీలర్లు, గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com