ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో బ‌రి నుంచి ముందే త‌ప్పుకున్న ఎంపీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 10:01 PM

లోక్‌స‌భ‌కు త్వ‌ర‌లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్నాయి. చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు కూడా ముగిశాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ ఎప్పుడు విడుద‌ల అవుతుంద‌న్న దానిపైనే దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. తెలంగాణ‌కు ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో అంత‌గా వేడి లేక‌పోయినా.. ఏపీలో మాత్రం పాలిటిక్స్ ట్రిక్స్ జోరుగా సాగుతున్నాయి. పార్టీల్లో చేరిక‌లు.., ప్ర‌తిప‌క్ష‌, అధికార ప‌క్ష విమ‌ర్శ‌లు, ఓట‌ర్ల మ‌నసు గెలుచుకునేందుకు ఎవ‌రికివారూ వ్యూహ ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గనున్నాయి. అదే స‌మ‌యంలో లోక్‌స‌భ ఎన్నిక‌లు కూడా ఉండ‌టంతో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ స్థానాలు ఉండ‌గా ఏపీలో 25, తెలంగాణ‌లో 17 స్థానాలున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీలు టార్గెట్లు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నాయి. వీలైన‌న్ని ఎక్కువ ఎంపీలు స్థానాలు సాధిస్తే కేంద్రంలో రానున్న ప్ర‌భుత్వంలో ప‌లుకుబ‌డి ఉంటుంద‌ని, త‌ద్వారా కేంద్రంలో పెత్త‌నం చ‌లాయించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నాయి. తెలంగాణ‌లో 17 ఎంపీ స్థానాల‌కుగానూ 16చోట్ల గెలుపే ల‌క్ష్యంగా తెరాస అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. ఏపీలోనూ అధికార‌, విప‌క్ష పార్టీలు బ‌లంగా ఉండ‌టంతో ఎవ‌రికివారూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవ‌రికివారూ 22-24కుపైగా ఎంపీలు స్థానాలు గెలుచుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ ద‌శ‌లో ఇప్ప‌టికే ఉన్న ఎంపీల్లో ఎవ‌రెర‌వ‌రు పోటీ చేస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న వారిలో వ‌యోబారం, ఇత‌ర‌త్రా రాజ‌కీయాల కార‌ణాల‌తో పోటీ నుంచి త‌ప్పుకునేవారే ఎక్కువ‌గా ఉన్నారు.
తెలంగాణ‌లో ఇప్ప‌టికే రెండు ఎంపీ స్థానాలు ఖాళీ అయ్యాయి. పెద్ద‌ప‌ల్లి, మ‌ల్కాజిగిరి స్థానాలు ఖాళీ అయ్యాయి. పెద్ద‌ప‌ల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమ‌న్‌, మ‌ల్కాజిగిరి ఎంపీగా ఉన్న సీహెచ్ మ‌ల్లారెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత వీరు రాజీనామా చేయ‌డంతో లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ రాజీనామాలు ఆమోదించారు. దీంతో వీరిద్ద‌రూ వ‌చ్చే లోక్‌స‌భ‌కు తిరిగి పోటీ చేసే అవ‌కాశం లేదు.
ఇక న‌ల్లొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి తెరాస‌లో చేర‌డంతో ఆయ‌నకు రైతు స‌మ‌న్వ‌య‌స‌మితి ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయ‌డం దాదాపు అనుమాన‌మే. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌ర‌గుతోంది. మ‌రోవైపు రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడిగా కూడా కేబినెట్ హోదా ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ లోక్‌స‌భ నుంచి పోటీ చేయడం లేదు. ఇక్క‌డి నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఇంకా అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కాలేదు.
సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ త‌ర‌ఫున బండారు ద‌త్తాత్రేయ గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌నున్నారు. వ‌యోభారం రీత్యా ద‌త్తాత్రేయ‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే బీజేపీ అధిష్థానం నిర్ణ‌యించింది. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ టికెట్ ఆశిస్తున్నారు. ద‌త్తాత్రేయ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోనున్నారు.
గ‌త ఎన్నిక‌ల‌లో తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో నాగ‌ర్‌క‌ర్నూల్ ఒక‌టి. ఇక్క‌డి నుంచి నంది ఎల్ల‌య్య విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌న పోటీ చేయ‌డం అనుమానంగా మారింది. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్క‌డి నుంచి మ‌ల్లు ర‌వి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. నంది ఎల్ల‌య్య తిరిగి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేది లేన‌ట్టే..!
ఇక మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీతారాంనాయ‌క్‌, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విష‌యంలో తెరాస అధిష్ఠానం ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తోంది. వారికి టికెట్ కేటాయించే విష‌యంపై కేసీఆర్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ముఖ్యంగా బీబీ పాటిల్ సంగ‌తి ప‌క్క‌న పెడితే సీతారాంనాయ‌క్‌కు బ‌దులుగా వేరొక‌ర్ని బ‌రిలో దించాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అదే జ‌రిగితే సీతారాంనాయ‌క్ కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డం అనుమాన‌మే.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్క‌డ కొత్త‌ముఖాలే..
తెలంగాణ‌లోనే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ చాలామంది ఎంపీలు తిరిగి పోటీ చేసే విష‌యంలో సందిగ్దం నెల‌కొంది. ముఖ్యంగా అధికార టీడీపీలో ఈ విష‌యంపై గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎక్కువ‌గా ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. కొత్త అభ్య‌ర్థులను వెతుక్కోవాల్సి వ‌స్తోంది. ఇప్ప‌టికే అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డి పోటీ నుంచి వైదులుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న స్థానంలో త‌న త‌మ్ముడు లేదా కుమారుడికి టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. ఆమె చేరేప్పుడు టికెట్‌పై చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆయ‌న చేరితే క‌ర్నూలు ఎంపీ టికెట్ కోట్ల‌కు కేటాయించి బుట్టా రేణుక‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ ప‌రిణామం చోటుచేసుకుంటే రేణుక పోటీ చేయ‌డం దాదాపు క‌ష్ట‌మే. ఇక అనకాప‌ల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీ‌నివాస్ కూడా తిరిగి పోటీ చేసే విష‌యంలో సుముఖంగా లేరు. ఆయ‌న పార్టీ మార‌తార‌ని విశాఖ‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని శ్రీ‌నివాస్ భావిస్తున్నారు. దీంతో ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. మ‌చిలీప‌ట్నం ఎంపీగా కొన‌క‌ళ్ల నారాయ‌ణ రెండు ప‌ర్యాయాలు గెలిచారు. ఆయ‌న ఈసారి పెడన అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు అయిష్ట‌త చూపుతున్నారు. చంద్ర‌బాబు కూడా మచిలీ ప‌ట్నం నుంచి కొత్త వ్య‌క్తిని బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నారు. కొన‌క‌ళ్ల పోటీలో ఉండ‌టంలేదు. కాకినాడ ఎంపీగా ఉన్న తోట త్రిమూర్తులుది అదే ప‌రిస్థితి. ఒక‌వైపు పోటీ చేయాల‌ని అధిష్ఠానం నుంచి ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ తిరిగి పోటీ చేస్తారా.. లేదా అన్న‌ది సందిగ్ధంగా మారింది. అలాగే న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా పోటీ చేయ‌డం అనుమానంగా మారింది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com