ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ విషయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సమర్థిస్తూ.. డ్రైవర్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతో పాటూ అన్ని ప్రయోజనాలు కల్పించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపారంటూ ప్రయాణికులు, తోటి ఉద్యోగులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని కోర్టు తప్పుబట్టింది.
విశాఖపట్నం జ్ఞానాపురానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వరరావు ఆర్టీసీ డ్రైవర్. ఆయన మద్యం సేవించి బస్సు నడుపుతున్నారన్న ఆరోపణలపై సర్వీసు నుంచి తొలగించారు. వెంకటేశ్వరరావు తనకు అన్యాయం జరిగిందని.. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. అక్కడ ట్రిబ్యునల్ వెంకటేశ్వరరావు తొలగింపును సమర్థించింది. ఆయన వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. వెంకటేశ్వరరావు మద్యం తాగి వాహనం నడిపారన్న విషయంలో ప్రయాణికులు, సహోద్యోగి చెప్పిన సాక్ష్యం ఆధారంగా సర్వీసు నుంచి తొలగించడం చెల్లదని కోర్టు అభిప్రాయపడింది. ఆయన మద్యం తాగారని నిరూపించేందుకు వైద్య పరమైన సాక్ష్యం ఉండాలని తీర్పును వెల్లడించారు. తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. విశాఖ ఆర్టీసీ డిపో మే నేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. వెంకటేశ్వరరావును సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. దీన్ని 8 వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది.
![]() |
![]() |