ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్లలో ప్రయాణించి.. కేన్సర్ బారిన పడుతున్న ప్రజలు.. అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 09:19 PM

ఒకప్పుడు ధనవంతులకు విలాసాల కోసం ఉపయోగించిన కార్లు.. ప్రస్తుతం మధ్య తరగతి వారికి కూడా నిత్యవసర వస్తువుగా మారింది. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లాలంటే కారు తీయాల్సిందే. కారు లేని వారు నగరాల్లో ఉండేవారు క్యాబ్‌లు, ట్యాక్సీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక కారులోకి మనం ఎక్కగానే వెరైటీగా వాసన వస్తూ ఉంటుంది. ఇక ఎండాకాలం అయితే చెప్పనక్కర్లేదు. ఆ వాసనతో తల తిరిగిపోతుంది. కొద్దిసేపు కారు అద్దాలు ఎక్కించి.. ఎండలో పార్క్ చేసిన కారులోకి ఎక్కితే ఘాటు వాసనలు వస్తూ ఉంటాయి. అవి పీల్చుకుని కొందరు వాంతులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాసనలను పోగొట్టేందుకు ఏసీ, కారులో ఎయిర్ ఫ్రెషనర్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కారులో వచ్చే రసాయనాల వాసన క్యాన్సర్‌కు దారి తీస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.


అమెరికా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ రీసెర్చ్ చేశారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు.. 2015 నుంచి 2022 వరకు మోడల్ కలిగిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 99 శాతం కార్లలో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు గుర్తించారు. ఆ కార్ల నుంచి అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ అనే కెమికల్ విడుదలైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఇదే కాకుండా క్యాన్సర్‌ వ్యాధికి కారణం అయ్యే టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు కూడా కార్లలో నుంచి విడుదల అవుతున్నాయని నిర్ధారించారు.


ఈ రీసెర్చ్‌పై అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేటివ్-ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ స్పందించింది. కార్ల లోపల వెదజల్లే ఫైర్‌ రిటార్డెంట్ కెమికల్స్ ప్రమాణాలను అప్‌డేట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక కార్లలో అనేక కారణాల వల్ల వ్యాపించే మంటలను అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అమెరికా హెల్త్‌ డిపార్ట్‌మెంట్ చేసిన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.


సాధారణంగా ఒక కారు డ్రైవర్ సగటున ఒక రోజుకు గంటసేపు కారులో ప్రయాణిస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన లీడ్ రీసెర్చర్ అండ్ టాక్సికాలజీ సైంటిస్ట్ రెబెకా హోయిన్ పేర్కొన్నారు. ఇక ఎక్కువ సేపు కారులో ఉండే ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న పిల్లల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక వేసవి కాలంలో ఈ రసాయనాలు అధిక మోతాదులో విడుదల అవుతున్నాయని పేర్కొంది. అయితే కారులోని సీటు ఫోంల నుంచి ఈ క్యాన్సర్ కారక రసాయనాలు విడుదల అవుతున్నాయని వెల్లడించింది. కార్లను తయారు చేసేవారు సీటు ఫోం, ఇతర భాగాల్లో ఈ మంటలను అదుపుచేసే రసాయనాలను కలుపుతారని.. అయితే వాటి కారణంగా ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది. అయితే ఇలా కార్లలో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయనాలను తగ్గించేందుకు గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ కొన్ని సూచనలు చేశారు. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలను తెరిచి ఉంచడం.. ఎండలో కాకుండా కార్లను నీడలో, గ్యారేజీల్లో పార్క్ చేసి ఉంచడం ద్వారా కార్ల నుంచి విడుదలయ్యే రసాయనాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com