ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె ఎందరో నిరుద్యోగులకు రోల్‌మోడల్‌

national |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 03:19 PM

కరోనా పేరు చెప్పగానే దేశంలో తొలుత ఉలిక్కిపడిన ప్రాంతం. రాజస్థాన్‌లోని భిల్వారా పట్టణం. దేశంలో మొదట ప్రకటించిన ‘హాట్‌స్పాట్‌’లలో ఇదీ ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తి భిన్నం. పక్కాగా కట్టడిని పాటించి, కొవిడ్‌-19 వైరస్‌ను పారద్రోలిన తొలి ప్రాంతంగా ఘనతకెక్కింది. అందుకు కారణం యువ ఐఏఎస్‌ అధికారిణి టీనా దాబి బృందం. ఆమె అనుసరించిన కట్టుదిట్టమైన నియంత్రణ విధానం. ప్రస్తుతం దేశానికే ఆదర్శప్రాయమైన ఆ ‘మోడల్‌’. దాని వెనక ఆమె కృషి నిరూపమానం.


టీనా దాబి..ఈ పేరే ఒక సంచలనం. నాలుగేళ్ల కిందట సివిల్‌ సర్వీసెస్‌లో మొదటి ర్యాంకు తెచ్చుకుని యావత్‌ దేశాన్నీ ఆకర్షించారు. అంతేకాదు ప్రథమ ర్యాంకు సాధించిన మొదటి దళిత మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. కానీ ఆ విజయం టీనాకు కొన్ని చేదు అనుభవాలను మిగిల్చింది. ర్యాంకు విషయంలో ఆమె దళిత నేపథ్యాన్ని పేర్కొంటూ ప్రతిభను తక్కువ చేస్తూ ఆన్‌లైన్‌లో కొందరు అవమానకరంగా మాట్లాడారు. ఇవి ఆమెను మానసికంగా కుంగదీశాయి. ‘బహుశా నా ఈ సక్సెస్‌ తలచుకుని అత్యంత బాధపడిన ఐఏఎస్‌ టాపర్‌ని నేనేనేమో’ అంటూ ఒక సందర్భంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల ఐఏఎస్‌ శిక్షణలో సైతం తొలి స్థానం దక్కించుకుని, తనను విమర్శించినవారికి తగిన బుద్ధి చెప్పారు.


చదువులో చురుకుతనం, గలగలా మాట్లాడే తత్వం, టీనా చిన్నప్పటి నుంచి తెలివిగల విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. ఐఏఎస్‌ కావాలన్నది ఆమె కల. అందుకే డిగ్రీలో పొలిటికల్‌ సైన్స్‌ తీసుకుని, సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యారు. ఆమె తండ్రి జస్వత్‌ దాబి బీఎస్‌ఎన్‌ఎల్‌లో జనరల్‌ మేనేజర్‌. తల్లి హిమాని ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో మాజీ అధికారిణి. కూతురు ఆశయ సాధనకు తల్లితండ్రులిద్దరూ అండగా నిలిచారు. టీనా, ఆమె చెల్లి రియాల చదువు కోసం హిమాని ఉద్యోగం మానేశారు. టీనాకు అమ్మే స్ఫూర్తి రోల్‌మోడల్‌. టీనా పుట్టింది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో. పెరిగింది, చదువుకున్నది మాత్రం ఢిల్లీలో! టీనా తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించడమే కాకుండా ప్రథమ ర్యాంకు తెచ్చుకున్నారు. ట్రావెలింగ్‌ను ఇష్టపడే టీనా మంచి చిత్రకారిణి కూడా! చిన్నప్పటి నుంచి భారత రాజ్యాంగం, రాజకీయాలను ఒంటపట్టించుకున్నారు. రాజస్థాన్‌లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన టీనా దాబి ప్రస్తుతం భిల్వారా సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన టీనా రెండో ర్యాంకర్‌ అథర్‌ ఆమిర్‌ను రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఐఏఎస్‌ శిక్షణా సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కించింది.


లాక్‌డౌన్‌ తరువాతే అసలు పరీక్ష మొదలైంది జిల్లా అధికారులకు. ‘‘ప్రజలు బయటకు రాకుండా చూడటం పెద్ద సవాలు. లాక్‌డౌన్‌ తొలి మూడు నాలుగు రోజులు నగరంలోని ప్రతి ప్రాంతం నుంచి భయంకరమైన కాల్స్‌ వచ్చేవి. ఎన్నో సమస్యలు వినిపించేవి. అయితే దేశం కోసం పనిచేస్తున్నామన్న ఆలోచన మాలో అలసత్వం రానివ్వలేదు. ఇది హెల్త్‌ ఎమర్జెన్సీ. కనుక ఎంతటి కష్టమైనా భరించడానికి, ఏ సమస్యనైనా నెత్తికెత్తుకోవడానికి సిద్ధమయ్యాం’’ అంటూ తన అనుభవాలు చెప్పుకొచ్చారు టీనా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలతో ఆమె సౌమ్యంగా మాట్లాడేవారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయేవారు. ఇంటింటికీ నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకున్నారు. అందరికీ అవగాహన కల్పించారు. ఆమె అలుపెరుగని కృషితో కరోనాపై భిల్వారా విజయం సాధించింది. దేశంలో ఈ వైరస్‌ను పారద్రోలిన తొలి ప్రాంతంగా నిలిచింది. టీనా బృందం అనుసరించిన ఈ ‘మోడల్‌’ను ఇప్పుడు దేశమంతా ఆదర్శంగా తీసుకొంటోంది. ఒక ఐఏఎస్‌ అధికారిణిగా ఎందరో ప్రజల జీవితాలు మార్చవచ్చంటున్న ఆమె... భిల్వారాలో కరోనా కట్టడి ద్వారా దాన్ని చేతల్లో చూపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com