ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం తాగి కారు యాక్సిడెంట్‌లో ఇద్దర్ని చంపిన మైనర్.. కోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:20 PM

మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోర్టులు, పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది పట్టించుకోవడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బైక్‌లు, కార్లు తీసుకుని.. రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లు చేసి.. ఎందరో ప్రాణాలు తీసిన వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడే అవి సంచలనం కాగా.. ఆ తర్వాత షరామామూలే. అయితే తాజాగా ఓ 17 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి అర్ధరాత్రి పబ్‌కు వెళ్లి పీకల దాకా తాగి.. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఓ బైక్‌కు ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడు. అయితే అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా.. ఆ బాలుడికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు విధించింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. ఈ ఘోర యాక్సిడెంట్‌లో ఆ మైనర్‌కు కఠిన శిక్షలు విధిస్తారని అంతా భావించినా.. పూణే కోర్టు బెయిల్ మంజూరు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రోడ్డు ప్రమాదాలపై వ్యాసం రాయాలని.. అంతేకాకుండా 15 రోజుల పాటు యరవాడ ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి.. సిగ్నళ్లలో ట్రాఫిక్ సూచనలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా మద్యం తాగే అలవాటు ఉండగా.. దాన్ని తగ్గించుకునేందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించింది. అయితే మద్యం సేవించడమే కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అతి వేగంగా పూర్తి నిర్లక్ష్యంతో కారు నడిపి ఇద్దరి చావుకు కారణమైన వ్యక్తికి అంత తక్కువ శిక్ష విధించడంపై పోలీసులతోపాటు ఈ విషయం తెలిసిన చాలా మంది నోరెళ్లబెట్టారు.


అయితే 18 ఏళ్లు నిండేందుకు ఆ మైనర్‌కు కేవలం 4 నెలలు మాత్రమే తక్కువగా ఉందని.. అతడు చేసిన నేరం చాలా తీవ్రమైందని.. అందుకే అతడ్ని మేజర్‌గా పరిగణించి.. కఠిన శిక్ష విధించాలని పోలీసులు కోర్టును కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ కేసులో బెయిల్ నిరాకరించేందుకు ఎలాంటి కారణాలు కనిపించలేదని పేర్కొన్న కోర్టు.. అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను కేవలం ఘటన జరిగిన 15 గంటల్లో ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు.


ఆదివారం అర్ధరాత్రి.. ఓ బాలుడు తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి.. పబ్‌కు వెళ్లాడు. ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పోర్షే అనే ఖరీదైన కారులో తిరిగి ఇంటికి బయల్దేరిన ఆ బాలుడు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు ఇంజనీర్లను ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో కారు గంటకు 200 స్పీడుతో ఉన్నట్లు తెలిపాడు. ఆ పోర్షే కారుకు నంబర్ ప్లేట్లు కూడా లేవని వెల్లడించాడు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని.. అయితే కారులో ముగ్గురు మైనర్లు ఉండగా.. ఒకరు పరారీలో ఉండగా.. మిగిలిన ఇద్దర్నీ పట్టుకుని స్థానికులు పోలీసులకు పట్టించారు. ఇక ఈ యాక్సిడెంట్ చేసిన బాలుడి తండ్రి పూణేలో ఫేమస్ రియల్టర్ అని పోలీసులు పేర్కొన్నారు.


మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అనీష్ అవధీయ, అశ్వినీ కోస్తాగా గుర్తించారు. వారిద్దరూ పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొనడంతో అశ్వినీ గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న కారుకు అనీష్ ఢీకొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారి స్నేహితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కోర్టు ఆ బాలుడికి బెయిల్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు బెయిల్ నిర్ణయాన్ని పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com