ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ విజయం పక్కా.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం డేటూ, టైమ్ ఫిక్స్ చేసిన వైవీ సుబ్బారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 08:47 PM

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైన తర్వాత.. అన్ని పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. భారీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని వైసీపీ చెప్తుంటే.. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శమని టీడీపీ కూటమి చెప్తోంది. అయితే.. రూరల్ ఓట్లు, మహిళలు, వృద్ధులు తమవైపే ఉన్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం 2024 ఎన్నికల్లో తమదే విజయమని ధీమావ్యక్తం చేశారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సైతం ఈసారి గెలుపు మాదే అంటున్నారు.


ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని వైసీపీ నేత, ఎంపీ, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు గెలవబోతోందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జూన్ 9న ఉదయం 9.30కి విశాఖపట్నంలో వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఉంటుందని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మే 13వ తేదీ జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే వైసీపీదే విజయమని తెలుస్తుందన్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు పెద్దసంఖ్యలో వచ్చి వైసీపీకి ఓటువేశారని చెప్పారు.


అటు విజయం మీద టీడీపీ కూటమి కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 130 నుంచి 140 స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓడిపోతామని తెలిసే.. వైసీపీ నేతలు బీరాలు పలుకుతున్నారంటుూ విమర్శలు చేస్తున్నారు.భారీగా పోలింగ్ శాతం నమోదుకావటంతో పోలింగ్ సరళి ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యూహకర్తలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమంటున్నారు. మరి ఏపీ ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారో తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకూ ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com