వేరుశనగ రైతులకు ఖరీఫ్ వేరుశనగ విత్తనాలను ఈ నెల 17 నుంచి రాయితీపై పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట కావడంతో 2.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కేటాయించారు. కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలకు 1.60 లక్షల క్వింటాళ్లు వెరసి 4.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. క్వింటాల్ విత్తనాల ధర రూ.8,680గా నిర్ణయించారు. అయితే అందులో 40 శాతం అంటే రూ.3,472 రాయితీ ఇస్తున్నారు. రైతులకు క్వింటా విత్తనాలను రూ.5,208కే అందజేస్తారు. సోమవారం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అవసరమైన రైతుల రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 17 నుంచి వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17నుంచి మూడు విడతలుగా విత్తనాలు పంపిణీ చేసేలా మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ఆర్బీకే వేదికగా విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు గ్రామాల్లోనే పంపిణీ చేస్తారు. విత్తనాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా పంట సాగు చేసి ఈ–క్రాప్ లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు వర్తిస్తాయి.