ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రుల వ్యాఖ్యలు సీఎం జగన్ వ్యాఖ్యానాలే: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2019, 02:10 PM




ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకుపోయాయన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, మంత్రులు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ వ్యాఖ్యానాలేఅని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదని మండిపడ్డారు. చనిపోయినవారిని కూడా అవమానించే ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది టీడీపీయేనని ఆయన అన్నారు. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌కు మద్దతిచ్చామని, ప్రజా సమస్యలపై ఎవరు ఆందోళనలు చేసినా టీడీపీ సంఘీభావంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

 అప్పట్లో వనజాక్షి అంశంపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా మహిళలు, అధికారిణి మధ్య వివాదాన్ని రాజకీయం చేశారన్నారు. వన్ మ్యాన్ కమిషన్ వేసి పరిస్థితిని చక్కదిద్దామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆ ఒక్క ఘటన తప్ప మరో సంఘటన జరగలేదన్నారు. చింతమనేని ప్రభాకర్‌పై అక్కసుతోనే టీడీపీని టార్గెట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

 ఉచిత ఇసుక పంపిణీ అన్ని సమస్యలకు పరిష్కారమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేల పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోడెల ఆత్మహత్య వైసీపీ వేధింపులకు పరాకాష్ట అని అన్నారు. 150 రోజుల్లో 630 అరాచకాలకు పాల్పడ్డారని, చలో ఆత్మకూరు ఆందోళనలతో కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇచ్చామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులను లీగల్ సెల్ సమగ్రంగా పరిశీలిస్తోందని, కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com