ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మార్ట్ సిటీ నిర్మాణానికి భూమి ఇవ్వకపోతే చంపేయండి.. సౌదీ రూలర్ ఆదేశాలు

international |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:36 PM

తమ కలల ప్రాజెక్ట్ ‘నియోమ్‌’స్మార్ట్ సిటీకి ఎవరు అడ్డుపడినా భూమ్మీద నూకలు చెల్లినట్టేనని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. సిటీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు సహకరించకపోతే నిర్దాక్షిణ్యంగా వ్వవహరించాలని అధికారులకు సౌదీ రాజు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కల్నల్ రభిహ్‌ ఎలెన్జీ వెల్లడించినట్టు బీబీసీ నివేదిక పేర్కొంది. గతేడాది సౌదీ నుంచి పారిపోయి యూకేలో ఆశ్రయం పొందుతున్న ఎలెన్జీ.. తాము అనుకున్నది పూర్తిచేయడానికి సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో వెల్లడించారు. ఆ ప్రాంతం నుంచి ఖాళీచేయించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఓ వ్యక్తిని కాల్చి చంపినట్టు పేర్కొన్నారు.


సౌదీ 2023 విజన్‌లో ‘నియోమ్’ స్మార్ట్ సిటీ ఓ భాగం. ఈ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో భూమి అవసరమవుతుంది. అందుకే మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు 2020లో సౌదీ సైన్యం ప్రయత్నించి విజయం సాధించింది. 6 వేల మందికిపైగా ఖాళీచేయించినట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నా.. ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని యూకేకు చెందిన మానవహక్కుల సంస్థ ALQST అంచనా. ఈ ప్రాంతంలో హువైటీ తెగకు చెందిన ప్రజలు నివాసం ఉంటారు. తన భూమిలోకి అధికారులను రానీయకుండా అడ్డుకోవడంతో అబ్దుల్‌ రహీం అల్‌ హువైటీ అనే వ్యక్తి సౌదీ దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టిన మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్రవాద నేరాలపై అరెస్టు చేయగా... ఐదుగురికి మరణశిక్ష విధించారు. అంతేకాదు, హువైటీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్టు చేశారు.


యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మానసపుత్రిక అయిన ది లైన్ ప్రాజెక్ట్‌ను 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పు.. 170 కి.మీ. పొడవున నిర్మించనున్నారు. నియోమ్‌లో నివసించే వారి సంక్య 2026 నాటికి 4.5 లక్షలు, 2030 నాటికి 20 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. త్రీడీ కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధతో అందే సేవలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్మాణంలో అద్దాలను ఎక్కువగా వినియోగించనున్నారు. మెగాసిటీ న్యూయార్క్ కంటే 33 రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అకాబా గల్ఫ్, ఎర్ర సముద్రం తీరం వెంబడి విస్తరించే ఈ నగర విస్తీర్ణం 26,500 చదరపు కి.మీ. నియోమ్ అనేది గ్రీక్, అరబిక్ పదాల కలయిక. గ్రీకు పదం ‘నియో’, అరబిక్ పదం ‘భవిష్యత్తు’.


సౌదీలో చమురు నిల్వలు గణనీయంగా తగ్గిపోతుండగా... ప్రపంచం కూడా గ్రీన్‌ ఎనర్జీ వైపు క్రమంగా మళ్లుతోంది. దీంతో సౌదీ ఆదాయానికి భవిష్యత్తులో గండిపడే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సౌదీ పాలకులు.. పర్యాటక ప్రదేశం, గ్లోబల్‌ హబ్‌గా తీర్చి దిద్దేలా ‘నియోమ్‌’ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్ చేపట్టారు. దీనికి 500 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com