ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నీడ మాయమయ్యే అరుదైన సన్నివేశం,,,హైదరాబాద్ దర్శనమివ్వనున్నది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:57 PM

రేపు హైదరాబాద్ నగరంలో.. అరుదైన ఆసక్తికరమైన అద్భుత సన్నివేశం ఆవిష్కృతమవనుంది. మంగళవారం రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం కానుంది. నీడ మాయమవటమేంటీ.. అన్న డౌటనుమానమా. అదేనండి జీరో షాడో డే.. అంటే ఈ రోజున ఒకానొక సమయంలో నీడ మొత్తానికే కనిపించదన్న మాట. ఇదేదో మాయో.. గమ్మత్తో కాదు.. సైన్స్. అయితే.. ఈ రోజున సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా నీడ కనిపించదని సైంటిస్టులు వివరిస్తున్నారు. అందుకే దీన్ని జీరో షాడో డే అని పిలుస్తారు. ఎండలో నిట్ట నిలువుగా ఉంచిన వస్తువుల షాడో.. సదరు రెండు నిమిషాల పాటు కనిపించదు. ఈ విషయాన్ని బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారులు వెల్లడించారు. అయితే.. ఇటువంటి అరుదైన, ఆసక్తికర, అద్భుత ఘటన రేపు హైదరాబాద్‌లో ఆవిష్కృతమవుతోందని తెలిపారు. దీన్ని నగరవాసులంతా కచ్చితంగా అనుభూతి చెందాలని తెలిపారు.


అయితే.. సూర్యకాంతిలో ఉంచిన ప్రతి వస్తువుకు నీడ కచ్చితంగా ఉంటుంది. కానీ.. ఈ జీరో షాడో డే రోజున మాత్రం.. అదే సూర్య కాంతిలో ఏ వస్తువు ఉంచిన.. దాని నీడ పడదని.. ఈ అద్భుతం వెనక చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే.. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో రోజూ కురుస్తున్న వర్షాల వల్ల.. సూర్యుడు కనిపించకపోవటం వల్ల ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. అయితే.. ఇన్ని రోజులుగా మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు బయటకు వచ్చి రెండు రోజుల నుంచి భగభగా మండిపోతున్నాడు. దీంతో.. ఈ అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది.


భూమి రోజూ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ ఆత్మ భ్రమణానికి 24 గంటలు పడుతుంది. అలా భూమి భ్రమించటం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించినట్టుగా కనిపిస్తుంది. అయితే.. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో సూర్యుడు నడి నెత్తి మీది నుంచి వెళ్తూ.. సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో భూమ్మీద పడతాయి. ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ.. సరిగ్గా ఆ వస్తువు కిందే పడుతుంది. దీన్నే జీరో షాడో మూమెంట్‌ అని పిలుస్తారు.


నిత్యం సూర్యుడు.. మిట్ట మధ్యాహ్నం కాగానే తల మీదుగా వెళ్తున్నట్టు ఉంటుంది. అలా అని.. రోజూ జీరో షాడో ఉంటుంది కదా.. అనే డౌటనుమానం రావచ్చు. కానీ.. అలా ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతి రోజు సూర్యుడు తల మీదుగా వెళ్లడని.. ఒకవేళ అలా రోజూ వెళ్తే జీరో షాడో మూమెంట్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదని వివరిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉండటం వల్ల.. సూర్యకిరణాలు మధ్యాహ్నం సమయంలో భూమధ్య రేఖపై మాత్రమే పడుతాయి.. ఉత్తరాన, దక్షిణాన మాత్రం నేరుగా పడవు. అయితే.. భూమి కొన్నిసార్లు ఉత్తరముఖంగా, ఇంకొన్ని సార్లు దక్షిణముఖంగా ప్రయాణిస్తుంది. ఈ సమయంలో భూమి సుమారు 23.5 డిగ్రీలు వంపు ఉంటుందని తెలిపారు. దీంతో.. భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు.. మిట్ట మధ్యాహ్నం సమయంలో నేరుగా తల మీదనుంచి వెళ్తాడు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతంగా పిలుస్తారు. అయితే.. ఆ సమయంలోనే జీరో షాడో మూమెంట్ ఏర్పడుతుంది. ఈ అద్భుతం ఉత్తరాయణంలో ఓసారి.. దక్షిణాయణంలో ఇంకో సారి ఇలా.. ఏడాదికి రెండు సార్లు మాత్రమే అవిష్కృతమవుతుంది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com