ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేతబడి జాతకాల పేరిట గుంటూరులో భారీ మోసాలు.. లక్షల్లో వసూలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 30, 2021, 11:29 AM

కుర్రోకుర్రు.. మహర్జాతకమే తల్లి నీది.. కానీ నీ ఇంట ఏదో తేడా ఉంది.. అమ్మకు పూజ చేసి సరిచేయాలి అంటూ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు.. చెబుతా.. చెబుతా.. సోది చెబుతా.. నీ కొచ్చిన కష్టం తీరుస్తా అంటూ నిలువునా దోచేస్తారు.. చేతబడి జరిగిందంటూ నమ్మబలికి నట్టేట ముంచేస్తారు. మన మూఢనమ్మకాలే పెట్టుబడిగా ప్రస్తుతం జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా జ్యోతిష్యాలయాలు వెలిశాయి. దొంగస్వాములు పుట్టుకొచ్చారు. విద్యావంతులే వీరి చేతుల్లో చిక్కి దారుణంగా మోసపోతున్నారు.. ఇంకా సాధారణ ప్రజానీకం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రసాంకేతిక రంగాల్లో విశేష ప్రగతి సాధించాం. అంతరిక్షాన్నీ అందిపుచ్చుకుంటున్నాం. సామాజికంగానూ పురోభివృద్ధి సాధిస్తున్నాం.. అయినా ఇప్పటికీ మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఏదో పూజ చేస్తే మంచి జరుగుతుందని చెబితే సులువుగా నమ్మేస్తున్నాం. నిలువుదోపిడీలు చెల్లిస్తున్నాం.. ఇలాంటివేమీ లేవు.. నమ్మొద్దని.. ప్రముఖ పండితులు, ప్రవచనకర్తలే నెత్తీనోరూ మొత్తుకుంటున్నా మనలో మార్పు రావడం లేదనేందుకు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.


పొన్నూరుకు అతిదగ్గరగా ఉండే ఓ గ్రామంలో ఓ వ్యక్తి మంచిచెడులు చెబుతానంటూ ఓ దుకాణం తెరిచాడు. అతని వద్దకు వెళ్లిన వారిని నిలువునా దోచుకుంటున్నాడు. ఎవరైనా వెళ్తే ముందు దుకాణం సమీపంలోని ఓ కొట్టు వద్దకు వెళ్లి తెల్లకాగితం కొనుక్కురావాలని చెబుతాడు. అక్కడికి వెళ్లాక తెల్లకాగితం, ఓ కొబ్బరికాయ ఇచ్చి రూ.200 వసూలు చేస్తారు. ఆ తర్వాత తెల్లకాగితాన్ని ఒక పద్ధతి ప్రకారం మడిచి అమ్మవారి వద్ద పెట్టి దండం పెట్టుకుని రావాలని చెబుతారు. అమ్మవారు హుండీలో రూ.5వేలు వేయమంటోందని, తమ నోటికొచ్చిన అంకె చెప్పేస్తారు. ఆ డబ్బులు హుండీలో వేసిన తర్వాత తెల్లకాగితాన్ని రసాయనంలో కలిపిన నీటిలో ముంచి తీస్తారు. ముందుగానే తెల్లకాగితంపై పటికతో పిచ్చి గీతలు, బొమ్మలు వేసి ఉంచడం వల్ల రసాయనంలో ముంచిన తర్వాత దానిపై గీతలు, బొమ్మలు కనిపిస్తాయి. ఆఖరికి దొంగస్వామి వచ్చి వాటిని చూపి చేతబడి జరిగిందని భయపెట్టి, దానిని విరగడ చేయాలంటే పూజలు చేయాలని నమ్మిస్తాడు. రూ.లక్షల్లో వసూలు చేస్తాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.


జీవితంలో సమస్యలు సహజం. వాటికి శాస్త్రీయంగా పరిష్కార మార్గాలు వెతకాలి. అంతేగానీ అతీత శక్తులు, జ్యోతిష్యాలు, చేతబడులను నమ్మకూడదు. నమ్మితే దానిని ఆసరాగా చేసుకుని చాలా మంది మోసం చేస్తారు. ప్రజలను నమ్మించి దోచుకునే దొంగస్వాములు, జ్యోతిష్యుల భరతపడతాం. ఇలాంటి వారి గురించి తెలిసినా.. వారి వల్ల బాధితులైనా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి వారి పనిపడతాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - కె.సుప్రజ, డీఎస్పీ, గుంటూరు వెస్ట్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com