కల్కీ ఆశ్రమంలో నోట్ల గుట్టలు

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 06:05 PM
 

మహావిష్ణు అవతారమని చెప్పుకునే కల్కి భగవాన్ అక్రమాల పుట్ట బద్ధలైంది. కల్కి వారి అవినీతి సామ్రాజ్యాన్ని ఐటీ అధికారులు కూల్చేశారు. వారం రోజులుగా కల్కి ఆశ్రమాల్లో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ కల్కి అక్రమ సంపాదన లెక్కలను తేల్చింది. తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో తనిఖీలు చేసిన అధికారులు రూ.44 కోట్ల భారతీయ కరెన్సీతో పాటు రూ.20 కోట్ల విలువైన విదేశీని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 90 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు.


అక్రమ సొమ్ముతో కల్కీ కుటుంబ సభ్యులు విదేశాల్లో కంపెనీలు స్థాపించారని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనా, యూఏఈ, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న కల్కి దంపతుల కోసం ఐటీ అధికారులు గాలిస్తున్నారు.


 


కల్కి భగవాన్ అసలు పేరు విజయకుమార్ నాయుడు. గతంలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేసిన విజయకుమార్.. కొన్నేళ్ల తర్వాత చిత్తూరులో జీవాశ్రమ్ పేరుతో రెసిడెన్షియ్ల్ స్కూల్ నిర్వహించారు. ఆ తర్వాత తనకు తానుగా మహావిష్ణు అవతారమని ప్రకటించుకొని కల్కి భగవాన్‌గా మారిపోయారు. 1990ల్లో తమిళనాడుతో పాటు ఏపీలో చాలా ఫేమస్ అయ్యారు కల్కి. లక్షలాది మంది ప్రజలు ఆయనకు భక్తులుగా మారి..పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. తన దర్శనానికి వచ్చే భక్తుల నుంచి రూ.5వేల నుంచి 25వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.