ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకు మేనేజర్‌ను కిడ్నాప్ చేసిన జంట.. 800 కిలోమీటర్లు తీసుకెళ్లి రూ.50 లక్షలు డిమాండ్.. చివర్లో ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 10:21 PM

సినిమా స్టైల్‌లో కిడ్నాప్‌కు పాల్పడిన భార్యాభర్తలు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ బ్యాంకు మేనేజర్‌ను అపహరించి ఏకంగా రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే అన్ని డబ్బులు చెల్లించుకోలేకపోయిన ఆ బ్యాంకు మేనేజర్ కుటుంబం.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బ్యాంకు మేనేజర్‌ను రక్షించి.. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక బ్యాంకు మేనేజర్‌కు బుల్లెట్ గాయాలు అయినట్లు గుర్తించి.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది.


ఢిల్లీలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసే సతీష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 62 లో నివసిస్తున్నాడు. అయితే అదే ప్రాంతంలో ఉండే భూపేంద్ర.. ఎలాగైనా సతీష్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అందుకు తన భార్య, మరో స్నేహితుడితో కలిసి పథకం వేశాడు. అయితే వీరు సతీష్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన నిందితులు.. రాత్రిపూట సతీష్ ఇంటి మెయిన్ డోర్ మూసి ఉండదని గుర్తించారు. చివరికి శనివారం అర్ధరాత్రి.. సతీష్ ఇంట్లోకి చొరబడ్డారు. సతీష్ తలపై తుపాకీ ఉంచి.. బెదిరించారు.


ఆ సమయంలో సతీష్ స్నేహితుడు అమిత్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సుత్తెతో భూపేంద్ర దాడి చేశాడు. అనంతరం సతీష్ కారుతోపాటు పర్సు, అక్కడ ఉన్న వారి అందరి ఫోన్లు తీసుకుని అదే సతీష్ కారులోనే పరారయ్యారు. కారులోకి ఎక్కిన తర్వాత సతీష్ కాళ్లు, చేతులు, నోరు కట్టేసి సీటు కింద కనపడకుండా చేశారు. ఇక కారులో డీజిల్ పోసేందుకు సతీష్ క్రెడిట్ కార్డును నిందితులు ఉపయోగించారు. ఈ నేపథ్యంలోనే ఫరీదాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నారు.


బిలాస్‌పూర్ చేరుకున్న తర్వాత భూపేంద్ర ఇతర కిడ్నాపర్లు.. సతీష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. అప్పటికే సతీష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హర్యానా క్రైం బ్రాంచ్ పోలీసులు ఆరు స్పెషల్‌ టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే నిందితులను పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారులే వారితో మాట్లాడారు. చివరికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఆ రూ.5 లక్షలను సతీష్ బ్యాంకు అకౌంట్లో వేయాలని నిందితులు డిమాండ్ చేశారు. తమ వద్ద అంత డబ్బులేదని చెప్పడంతో మొదట రూ.1 లక్ష అకౌంట్లో వేసి.. మిగితా రూ.4 లక్షలను డబ్బు రూపంలో ఇవ్వాలని సూచించారు.


ఈ క్రమంలోనే సతీష్ భార్య నుంచి డబ్బు తీసుకునేందుకు భూపేంద్ర కేలి బైపాస్ వద్దకు చేరుకున్నాడు. క్యాబ్‌లో వచ్చి ఆమె దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత మళ్లీ క్యాబ్ ఎక్కాడు. అయితే అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు.. భూపేంద్రను అరెస్ట్ చేశారు. అనంతరం అతడ్ని విచారణ చేయగా.. సతీష్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురకు తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే భూపేంద్ర పోలీసులకు చిక్కాడని తెలిసి.. మిగిలిన నిందితులు పరారయ్యారు. ఆ తర్వాత మథురలో కిడ్నాప్ అయి ఉన్న సతీష్‌ను పోలీసులు రక్షించారు. బుల్లెట్ గాయాలతో ఉన్న సతీష్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com