ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్ ఆస్తిని సమాజ వనరుగా భావించవచ్చా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 10:26 PM

ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రయివేట్ ఆస్తిని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరమవుతుందని వ్యాఖ్యానించింది. సమాజ సంక్షేమం కోసం సంపద పునఃపంపిణీ జరగాలని ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.


ధర్మాసనం ఎదుట ముంబయిలోని ప్రాపర్టీ ఓనర్స్‌ అసోసియేషన్‌ (పీవోఏ) సహా పలువురు కక్షిదారుల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రస్తావించిన (39 (బి), 31 (సి) ఆర్టికల్‌ను సాకుగా చూపుతూ ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోజాలరని వాదించారు. అయితే, ఈ వాదనలతో విభేదించిన ధర్మాసనం.. ఇలాంటి అభిప్రాయం చాలా ప్రమాదకరమని పేర్కొంది. ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరుగా పరిగణించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది.


‘‘ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులుగా పరిగణించాలనడం సరికాదు.. ఇలాంటి అభిప్రాయం ప్రమాదకరం. ఉదాహరణకు.. ఆర్టికల్ 39 (బి) కింద గనులు, ప్రైవేటు అడవులకు ప్రభుత్వ విధానాలు వర్తించవు.. అందువల్ల దాని విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకోజాలదు అనడం తగదు’ అని సూచించింది. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఉన్న సామాజిక స్థితిగతులను ధర్మాసనం ప్రస్తావించింది. ‘సమాజంలో పరివర్తన తీసుకురావాలన్నది రాజ్యాంగం ఉద్దేశం. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాక దానికి ఆర్టికల్ 39 (బి) వర్తించదని చెప్పలేం. సమాజానికి సంక్షేమ చర్యలు అవసరం.. అందువల్ల సంపద పునఃపంపిణీ జరగాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది. ఈ సందర్భంగా జమీందారీ వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తావించారు.


‘సోషలిస్ట్ భావన ప్రకారం అనేది సమాజానికి సంబంధించింది...ఏదీ వ్యక్తికి ప్రత్యేకమైనది కాదు. సమాజానికి ఆస్తి అంతా ఉమ్మడి. సోషలిజం దృక్పథం ఇదే.. మరి ఆ తత్వం ఏమిటి? మన తత్వం ఆస్తిని మనం విశ్వసించేదిగా పరిగణిస్తుంది. ప్రయివేటు ఆస్తి లేదన్న సోషలిస్టు నమూనాను మనం అనుసరించడం లేదు..కానీ, మీకు తెలుసా మన ఆస్తి భావన పెట్టుబడిదారీ దృక్పథం లేదా సోషలిస్టు దృక్పథం కంటే చాలా భిన్నమైన, చాలా సూక్ష్మమైన మార్పుకు గురైంది’ అని అన్నారు.


‘కుటుంబంలోని తరువాతి తరాల వారికి అందజేయడానికి ఆస్తులను కూడబెడతాం.. కానీ విస్తృతంగా ఆ ఆస్తిని సమాజానికి నమ్మకంగా ఉంచుతాం... ఇది స్థిరమైన అభివృద్ధి భావన... నేటి తరంగా ఈ రోజు మనకు ఉన్న ఆస్తి మన సమాజ భవిష్యత్తు కోసం విశ్వసిస్తున్నాం... దానినే మీరు తరతరాలుగా వచ్చిన ఆస్తి అంటారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


శిథిలావస్థలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు వీలు కల్పించే మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్నది పూర్తిగా భిన్నమైన అంశమని, దానిపై విడిగా ఉత్తర్వులిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిండాల్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ సభ్యులుగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com