ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ ఎన్నికల్లో ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్‌పాల్ సింగ్.. జైలు నుంచే పోటీ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 10:33 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే ఓ విడత పోలింగ్ పూర్తి కాగా.. శుక్రవారం మరో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో రకరకాల వర్గాల వారు పోటీ చేస్తున్నారు. సినీ హీరో హీరోయిన్లు, టీవీ నటులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు.. వివిధ పార్టీల తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఖలిస్థానీ ఉగ్రవాది కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. వారిస్ పంజాబ్‌ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌.. పంజాబ్ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు అతని లాయర్ తాజాగా వెల్లడించారు.


ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను కలిసిన ఆయన లాయర్ రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా.. అమృత్‌పాల్ సింగ్‌ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా వెల్లడించారు. జైలులో అమృత్‌పాల్ సింగ్‌ను కలిసినపుడు ఎన్నికల్లో పోటీ గురించి అతడు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమృత్‌పాల్ సింగ్‌ పోటీ చేయనున్నట్లు తనకు చెప్పాడని లాయర్ వివరించారు.


ఇక ఇదే విషయంపై మరిన్ని చర్చలు జరిపేందుకు అమృత్‌పాల్ సింగ్ కుటుంబసభ్యులు కూడా అతడిని దిబ్రూగఢ్ జైలులో గురువారం ఆయనను కలవనున్నట్లు లాయర్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఖదూర్ సాహిబ్ నియోజకవర్గానికి చివరి విడతలో జూన్ 1 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున లాల్‌జిత్‌ సింగ్‌ భుల్లార్‌.. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడీ) తరఫున హర్‌పాల్‌ సింగ్‌ బలేర్‌ ఇప్పటికే బరిలో ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉండగా.. చివరి దశలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను గతేడాది ఏప్రిల్‌లో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్‌కు కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com