ఒక రోజు వ్యవధిలోనే రెండు రికార్డులు

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 30, 2019, 01:47 PM
 

అంతర్జాతీయ టీ20ల్లో ఒక రోజు వ్యవధిలోనే రెండు రికార్డులు నమోదయ్యాయి. ఛేదనలో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్‌ ఖడ్కా (నేపాల్‌) ఘనత సాధించాడు. అయితే, మహిళల జట్ల నుంచి శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు కూడా ఇదే ఫీట్‌తో అబ్బురపరిచింది. అలాగే ఈ రెండు జట్ల తరఫున కూడా శతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతోపాటు తక్కువ బంతుల్లో(49)నే శతకం సాధించిన నాలుగో ఆసియా కెప్టెన్‌గా ఖడ్కా నిలిచాడు. ముందుగా సింగపూర్‌తో శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన నేపాల్‌..ఖడ్కా ధాటిగా ఆడి అజేయంగా 106 పరుగులు చేయడంతో మరో నాలుగు ఓవర్లు ఉండగానే గెలిచింది. ఇక, ఆసీ్‌సతో ఆదివారం జరిగిన తొలి టీ20లో లంక మహిళల జట్టు 218 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగింది. ఓపెనర్‌ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 113) ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించినా జట్టు మాత్రం 41 పరుగులతో ఓడింది.