ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్‌పై 100 క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్.. షాకింగ్ వీడియోలు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 11:28 PM

పశ్చిమాసియాలో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా లెబనాన్, గాజాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 100కు పైగా క్షిపణులతో ఇరాన్.. భీకర యుద్ధం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్న ఐరన్ డోమ్‌ను యాక్టివేట్ చేశారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ వ్యాప్తంగా హైఅలర్ట్ విధించిన ప్రభుత్వం.. ప్రజలంతా షెల్టర్లలోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా యుద్ధానికి దిగడంతో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.


ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్‌ దాదాపు 100 క్షిపణులు ప్రయోగించగా.. అవన్నీ టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో పడి భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓవైపు ఇరాన్ మిస్సైళ్లు పడుతుండగానే.. మరోవైపు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రవాదుల కాల్పులు తీవర్ కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.


అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. ఇజ్రాయెల్‌పై దాడి చేయవద్దని ఇరాన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసినా పట్టించుకోని ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. అయితే ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయెల్‌కు అమెరికా ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇరాన్‌ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నగరం వణికిపోతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోంది. ఇరాన్ వ్యూహాలను తిప్పికొట్టేలా బలమైన ప్రతీకార దాడులు చేయాలని నిర్ణయించుకుంది.


ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో ఇరాన్ ఎంటర్ అయితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో తదుపరి ఏం పరిణామాలు జరగనున్నాయో అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ దాడుల గురించి ముందే కనిపెట్టిన వైట్‌హౌస్.. క్షిపణి దాడులు చేయవచ్చని హెచ్చరించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా.. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేసింది.


హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించగా.. అన్నట్టుగానే మంగళవారం ఇజ్రాయెల్‌పై దాడులు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్ రాజధాని బీరుట్‌లో మంగళవారం కూడా భీకర దాడులు చేస్తోంది. అంతేకాకుండా లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమాసియాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు చోటుచేసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com