ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ నళిన్‌కుమార్ కటిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు నిలిపేయాలని మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. తదుపరి విచారణను అక్టోబరు 22 కి వాయిదా వేసింది.
ఎలక్టోరల్ బాండ్‌ల పథకాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసిందని, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించేలా కేసు నమోదు చేశారని నళిన్ కుమార్ కటిల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈడీ అధికారులు, యడియూరప్ప కుమారుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలు నిందితులుగా ఉన్నారు.
కటీల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్.. ఫిర్యాదు చేసినట్టు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వాదించారు. ప్రయివేట్ వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఓ వైట్‌కాలర్ దోపిడీ అని, బాండ్లను కొనుగోలు చేయడానికి కొన్ని కంపెనీలలో ఈడీ భయాన్ని సృష్టించిందని అన్నారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల నుంచి అభ్యంతరాలు దాఖలయ్యేంత వరకు ప్రాథమిక విచారణ చేపట్టడ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే అమలులో ఉంటుందని పేర్కొంది. ‘‘ఐపీసీ సెక్షన్లలో బాధితులకు రక్షణ కల్పించే విధానాలున్నాయి.. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎలాంటి బాధితుడూ కాదు.. కేవలం ఈ ఫిర్యాదు ద్వారా ఐపీసీ సెక్షన్ 383 వినియోగం గురించి వెల్లడించాలన్న అభిప్రాయంతో ఉన్నారు’ వ్యాఖ్యానించింది. కాగా, ఎలక్టోరల్ బాండ్లలో అక్రమాలకు పాల్పడ్డారని జనాధికార సంఘ్ పరిషత్ సహాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు గత శుక్రవారం ప్రత్యేక కోర్టు విచారణకు ఆదేశించింది. శనివారం బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీసులు నిర్మలా సీతారామన్‌తో సహా బీజేపీ నాయకులపై కేసు నమోదుచేశారు.