డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు (మంగళవారం) తిరుమలకు రానున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉపముఖ్యమంత్రి.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తిరుమల్లోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. ఎల్లుండి (అక్టోబర్ 2) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూలైన్లను పరిశీలించనున్నారు.
అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.