ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 12:58 PM

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కావాలనే నాటకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. ఎక్కడ ఏం దొరకక టీవీ ఛానళ్లతో పబ్లిసిటి పెంచుకునేందుకు ట్వీట్లర్లో విమర్శలు చేస్తున్నారన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఏమన్నారంటే… 


“ప్రజాధనం ఆదా చేసేందుకు జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరం చూశాం. 23 సీట్లు మాత్రమే ఇచ్చి మూలన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుధ్దిరాలేదు. 4 మాసాలకే ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వంపై విషం గక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు కొన్ని పత్రికలు వంతపాడుతున్నాయి. తండ్రీకొడుకులు ట్వీట్ల మీద ట్వీట్లు కొడుతున్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది చంద్రబాబుతీరు. అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. 


సీఎం జగన్ అవినీతి జరిగిన చోట అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఈ ప్రక్రియ బ్రహ్మాండంగా సక్సెస్‌ అయింది. దాని ద్వారా ప్రజాధనం కాపాడబడితే హర్షించాల్సిందిపోయి దానిని కూడా విమర్శిస్తున్నారు .ఇలాంటి పని గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నిస్తున్నాను. ఒక్క పోలవరం లోనే 850 కోట్ల రూపాయల ఆదా జరిగింది. దీనిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. చంద్రబాబు పత్రికలో లీకేజి అని రాస్తున్నారు. గ్రామసచివాలయాల పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు. కీ కూడా వెంటనే ఇచ్చేశారు. అవి లీకేజి అయ్యాయని కుట్రపన్నారు. ఉద్యోగాలపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. 


ప్రభుత్వంపై కక్ష ఉంటే మరోవిధంగా తీర్చుకోవాలి తప్ప ఇలా చేయడం సరికాదు. మహాత్మాగాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో జగన్‌ గారు గ్రామ సచివాలయ వ్యవస్దను తీసుకువచ్చారు. లక్షా 25 వేల ఉద్యోగాలు కల్పించారు. ఏపీపీఎస్సీలో జరిగిందని మీరు రాస్తే మాకు సంబంధం లేదని వారు చెప్పారు. వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే పరిస్దితి లేదు. ఐదేళ్లలో చంద్రబాబు దుర్మార్గమైన పరిపాలన చేశారు. దానికంటే మంచిపరిపాలన వైఎస్‌ జగన్‌ అందిస్తుంటే సహించలేక బురదజల్లుతున్నారు. లింగమనేనివారి గెస్ట్‌ హౌస్‌ లో చంద్రబాబు ఎందుకు ఉన్నారు. నివాస యోగ్యమైన సొంత ఇంటిని ఐదేళ్లలో ఎందుకు చంద్రబాబు రాజధానిలో నిర్మించుకోలేకపోయారు. 


నదీ గర్భంలో ఇల్లు కడితే నిబంధనలు ఊరుకుంటాయా? అలాంటి ఇంట్లో ఉండటానికి మీకు సిగ్గులేదా? రోడ్డుపై అడ్డంగా ఇంటిని నిర్మిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానప్రతిపక్షనేతగా పనిచేశానని చెబుతారే చట్టాన్ని గౌరవించాల్సిన పనిలేదా? అక్రమకట్టడంలో మీరు ఉంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే దానిపై కక్ష సాధింపు అని వేధింపులని నానాయాగి చేస్తున్నారు. చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. లింగమనేని రమేష్‌ కు, చంద్రబాబుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రపంచమంతటికి తెలుసు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఆ ఇంటిని ఇచ్చేవారని లెటర్‌ రాశారు. సీనియర్‌ రాజకీయనేత,ప్రతిపక్షనేత అక్రమ కట్టడంలో ఉండటం ధర్మం కాదు. చంద్రబాబూ....లీగల్‌ గా నిర్మించిన ఇంట్లోకి వెళ్లి ఆదర్శంగా నిలవండి. ఆ ఇంటిని కూల్చివేస్తే అవి ఛానల్స్‌ లో వస్తే తనకు సింపతీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాంటిది ఏమీ రాదు. శిక్షించేటప్పుడు సింపతి రాదని స్పష్టం చేస్తున్నా. చంద్రబాబు అండ్‌ కంపెనీ, టిడిపి, ప్రభుత్వం పై నిత్యం బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని నమ్మద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పీపీఏల ద్వారా ఏడాదికి 2,500 కోట్ల నష్టం ప్రభుత్వంకు వస్తోంది. తద్వారా ఆ కంపెనీల వద్ద నుంచి తండ్రికొడుకులు కమీషన్ల పేరుతో నొక్కేశారు. రైతురుణమాఫీ అంటూ 87 వేల కోట్లు మాఫీ చేస్తామని దానిని 24 వేల కోట్లకు కుదించి తర్వాత కేవలం 15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. 4,5 వ విడత రుణమాఫి ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారు. చంద్రబాబు రుణమాఫి హామీకి జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఏం సంబంధం. రివర్స్‌ టెండరింగ్‌ లో వందల కోట్లు మిగిలిన సంగతి సుజనాచౌదరికి కనిపించడం లేదా? గతంలో మేఘా కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్‌ లు ఇవ్వలేదా? చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లోమీడియా మొదటి పేజీలలో రాస్తున్నాయి. ఎల్లో మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తండ్రికొడుకులు చేస్తున్నారు.” అని అంబటి రాంబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com