ముంబయి లాల్‌బాగ్చా రాజా మళ్లీ వస్తున్నాడు.. గణేష్ ఉత్సవాలు నిర్వహించనున్న సమితి

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 02:29 PM
 

ఓ భారీ సింహాసనంపై గంభీరంగా కూర్చొని ఉండే లాల్‌బాగ్చా రాజా గణేష్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. మన ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో.. ముంబైలో ఈ లాల్‌బాగ్చా రాజా కూడా అంతే. 93 ఏళ్లుగా దక్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గణేషుడి ఉత్సవాలు ఈసారి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. గతేడాది కరోనా కారణంగా ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించలేదు. దాని స్థానంలో 11 రోజుల పాటు రక్తం, ప్లాస్మాదాన శిబిరాన్ని ఉత్సవ కమిటీ నిర్వహించింది.


అయితే ఈసారి మాత్రం మళ్లీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్య పండుగగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఆదివారం ప్రకటించింది. అయితే ప్రతిసారీ పెట్టినట్లు భారీ గణేషున్ని కాకుండా ఈసారి మూడు నుంచి నాలుగు అడుగుల చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించనున్నారు. లాల్‌బాగ్చా రాజాను ప్రతి ఏటా లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. వీళ్లలో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వస్తాయి. ఈసారి గణేష్ చతుర్థి సెప్టెంబర్ 10న వస్తోంది.