ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీదేవికి శూర్పణఖ పెట్టిన శాపం ఏంటో తెలుసా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 08:01 PM

శూర్పణఖ.. రామాయణంలో కీలకమైన పాత్ర. ఆమె అసలు పేరు మీనాక్షి. కేకసి, విశ్రావసుల కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర దూషణలకు సోదరి. మారీచ, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యజ్జిహ్యుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరబాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు ‘తెలియక తప్పు జరిగిపోయిందని’ ఓదార్చాడు. మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెల్లదీస్తుంది.విభీషణస్తు ధర్మాత్మా అంటూ మొట్టమొదటి సారిగా రాముడి వద్ద విభీషణుడి పేరును ప్రస్తావించి, ఆయనపై శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది కూడా ఈ మీనాక్షే. దండకారణ్యంలో నరవాసన తగలి పరుగెత్తుకొచ్చిన ఈమె, రాముడి దర్శనంతో ఆకలిని సైతం మరిచిపోయి, కామ వికారిగా మారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేయిందుకోవాలని ఆశించింది. అందుకు సీతను చంపడానికి కూడా సిద్ధపడింది. సీతను చంపడానికి ఉద్యుక్తురాలవుతోన్న శూర్పణఖను తన అన్న శ్రీరాముడి ఆఙ్ఞ‌తో లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి వదిలిపెట్టాడు. అయితే ఈ శూర్పణఖ పూర్వ జన్మలో ఓ గంధర్వ కన్య.వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడటానికి ఓ రోజు ఈమె ప్రయత్నించింది. ఈ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు. దీనికి ఆగ్రహించిన ఆ గంధర్వ కాంత శేషుడి చెవులు, ముక్కుమీద పొడించింది. ఆమె చేసిన పనికి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేయగా, లక్ష్మీదేవితో ఆమె వాగ్వాదానికి దిగింది. ఇంతలో శ్రీహరి వచ్చి రాక్షసిగా జన్మించమని శపించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె లక్ష్మీదేవిని కూడా శపించింది. కాలాంతరమున నా కారణంగా నీకు భర్తతో వియోగం సంభవిస్తుందని శాపం ఇచ్చింది. ఆ గంధర్వాంగనే శూర్పణఖ.. ఆదిశేషుడే లక్ష్మణుడు. అలాగే తన భర్తను రావణుడు సంహరించాడనే కోపంతోనే రాక్షసనాశనం గావించింది శూర్పణఖ. చిన్న పాత్రే అయినా రామయణం మొత్తానికి ప్రధానమైనదిగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com