ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 ఏళ్లలో 17 మంది రోగులను చంపిన నర్స్.. 760 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

international |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:24 PM

ఏదైనా అనారోగ్యం వస్తే ముందుగా పరిగెత్తేది ఆస్పత్రికే. ఇక అక్కడ ఉండే డాక్టర్లు, నర్సులే.. మన ప్రాణాలు కాపాడే దేవుళ్లు అని నమ్ముతాం. ఇక ఆస్పత్రే దేవాలయంగా కొలుస్తారు. అలాంటి ఆస్పత్రిలో ప్రాణాలు పోయడం పక్కన పెడితే ప్రాణాలు తీసిన సంఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు.. అక్కడికి వచ్చే రోగులను హతమార్చడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. కేవలం 3 ఏళ్లలోనే వివిధ ఆస్పత్రుల్లో 17 మంది ప్రాణాలను ఆ నర్సు తీసింది. చివరికి ఆమె బండారం బయటపడటంతో కటకటాల పాలైంది. ఆమె చేసిన దారుణాలను విన్న కోర్టు.. ఆ నర్సుకు ఏకంగా 760 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాలని సంచలన ఆదేశాలు వెలువరించింది.


ఈ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగింది. హీథర్ ప్రెస్‌డీ అనే 41 ఏళ్ల నర్సు 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఆస్పత్రులకు వచ్చిన రోగులను 17 మందిని చంపేసింది. తాను పని చేసే ఆస్పత్రికి వచ్చిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి హీథర్ ప్రెస్‌డీ హతమార్చేది. ఈ కేసు గురించి విన్న పెన్సిల్వేనియా కోర్టు.. శనివారం సంచలన తీర్పునిచ్చింది. హీథర్ ప్రెస్‌డీకి 760 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2020 నుంచి 2023 వరకు హీథర్ ప్రెస్‌డీ.. పలు ఆస్పత్రుల్లో పనిచేసింది. ఆ సమయంలో వివిధ రకాల రోగాలతో ఆస్పత్రికి వచ్చే వారికి ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఇన్సులిన్‌ను ఇచ్చేది.


ఆ 3 ఏళ్లలో హీథర్ ప్రెస్‌డీ ఏకంగా 22 మందికి మోతాదుకు మించి ఇన్సులిన్‌ ఇచ్చింది. ఈ ఘటనలో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఎవరికైనా ఇన్సులిన్ అధిక మోతాదులో ఇస్తే హైపోగ్లైసీమియాకు దారితీసి.. దాని కారణంగా హార్ట్ బీట్ పెరిగి గుండె పోటుకు దారి తీస్తుంది. అయితే గతేడాది మే నెలలో ఓ ఆస్పత్రిలో ఇద్దరు రోగులను చంపినందుకు హీథర్ ప్రెస్‌డీపై.. ఆ ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపడం ప్రారంభించారు.


ఈ విచారణలో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ ఇద్దరు మాత్రమే కాకుండా గత కొన్ని ఏళ్లుగా హీథర్ ప్రెస్‌డీ.. ఇదే రకంగా మరికొంత మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిందని వెల్లడైంది. దీంతో అంతకుముందు హీథర్ ప్రెస్‌డీతో కలిసి పని చేసిన మరికొందరు నర్సులను కూడా పోలీసులు విచారణ చేశారు. హీథర్ ప్రెస్‌డీ గురించి మిగితా నర్సులు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ అయ్యారు. హీథర్ ప్రెస్‌డీ.. రోగుల పట్ల చాలా పరుషంగా ప్రవర్తించేదని.. వారితో దురుసుగా ప్రవర్తిస్తూ.. తరచూ రోగులను అవమానించేలా మాట్లాడేదని పోలీసులకు తెలిపారు. తనకు రోగులు, ఇతర నర్సులు, ఆస్పత్రి సిబ్బంది తనకు నచ్చట్లేదని.. వారిని ఏదైనా చేయాలని ఉందని తరచుగా తన తల్లికి మెసేజ్‌లు చేసేదని వెల్లడించారు.


అయితే ఆమెకు ఎలాంటి రోగం లేదని.. మతిస్థిమితం కూడా సరిగ్గానే ఉందని బాధితుల్లో కొందరు కోర్టుకు వెల్లడించారు. కానీ హీథర్ ప్రెస్‌డీ వ్యక్తిత్వమే మంచిది కాదని.. ఆమె తన తండ్రిని చంపడం తాను స్వయంగా చూశానని బాధితుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా విచారణలో తాను 3 హత్యలు, 19 హత్యాయత్నాలు చేసినట్టుగా హీథర్ ప్రెస్‌డీ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న కోర్టు.. హీథర్ ప్రెస్‌డీకి 760 ఏళ్ల శిక్ష విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com