ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత సహకరించాలి: కలెక్టర్ నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 06:34 PM

మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత సహకారం అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం మరుయు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ మరియు మినిస్ట్రీ ఆప్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ ఎబ్యూజ్ (మాదక ద్రవ్యాల నియంత్రణ ) అనే అంశంపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం, రవాణా అనేవి సమాజాన్ని విఛ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. వీటి వలన యువత నిర్వీర్యమవుతుందన్నారు. డ్రగ్స్ వాడకం మానసిక, శారీరిక స్థితులపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుందన్నారు. సమాజంలో అరాచకాలకు కారణమౌతుందన్నారు. దొంగతనాలు, హత్యలకు పాల్పడే పరిస్థితులు కలుగుతాయన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునే సిరంజుల ద్వారా హెచ్.ఐ.వి. వంటి భయంకర వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు కలుగుతాయని తెలిపారు. మాదక ద్రవ్యాల వాడకం వలన వారి మానసిక స్ధితి పూర్తిగా చెడిపోతుందని, ఆత్మహత్యకు పాల్పడే ధోరణి వారిలో కలుగుతుందన్నారు. విదేశాలనుండి ఓపియం, డ్రగ్స్, హెరాయిన్, గంజాయి వంటి మత్తు పదార్ధాలు దిగుమతి అవుతున్నాయన్నారు. పంజాబ్, హర్యానా వంటి మంచి ప్రవర్తన కల రాష్ట్రాలు సైతం మత్తుపదార్ధాలకు పూర్తిగా బానిసలు కాబడుతున్నట్లు తెలిపారు. వున్నత చదువులు చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధుల సైతం డ్రగ్స్ వాడకానికి బానిసలు అవుతూ, వాటిని స్మగ్లింగ్ చేసే స్ధాయికి దిగజారడం చాలా బాధాకరమన్నారు. డ్రగ్స్ వాడకం, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. హత్య చేసిన వారి శిక్ష కన్నా ఎక్కువ శిక్ష వుంటుందన్నారు. జైలు శిక్షతో పాటు నేర తీవ్రతను బట్టి మరణశిక్షను కూడా వేయడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కొన్ని వేల జీవితాలు నాశనమం కానున్నాయన్నారు. యుక్త వయస్సులో తల్లితండ్రుల సంరక్షణలో వుంటూ, వారు నిర్దేశించిన మార్గంలో నడవాలన్నారు. చెడు స్నేహానికి దూరంగా వుండాలన్నారు. యువత, విద్యార్ధులు తమ స్నేహితులు, చుట్టు పక్కల వారిని గమనించాలన్నారు. అనుమానితులను గుర్తించాలన్నారు. రిహేబిటేషన్ కేంద్రాలలో వారికి సైకియాట్రిస్ట్ ల ద్వారా కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుందన్నారు.


 


జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.చంచయ్య మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వాడకం అనేది యువత ఒక థ్రిల్ కోసం ప్రారంభించు తారని, అది కొన్ని రోజులకు అలవాటుగా మారుతుందని చెప్పారు. రోజు రోజుకు మోతాదు పెంచుతూ మాదకద్రవ్యాలను సేవిస్తారని, దీని ద్వారా శరీరం పూర్తిగా పాడైపోతుందని చెప్పారు. చిన్న వయస్సులోనే వృధ్ధాప్య లక్షణాలు వస్తాయన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు,టి.వి.లలో సైతం మద్యం సేవించడం ఒక హీరోయిజంగా చూపించడం చాలా హేయకరమన్నారు. కాలేజీలలో ఏ ఒక్కరికి మద్యం సేవించే అలవాటు వున్నా, అది అందరికీ వ్యాపిస్తుందన్నారు. యువత మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా వుండాలని సూచించారు. స్వామి వివేకానందుని చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. మాదక ద్రవ్యాల నియంత్రణ కరపత్రికను విడుదల చేసారు. అనంతరం ప్రొఫెసర్ విష్ణుమూర్తి, రిమ్స్ కళాశాల సైకియాట్రిస్ట్, వావిలపల్లి జగన్నాధం నాయుడు, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఎస్. సుఖేష్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, సెట్ శ్రీ సి.ఇ.ఓ జి.శ్రీనివాసరావు, నెహ్రూ యువకేంద్ర కో-ర్డినేటర్ ఎస్.శివప్రసాద రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు, యువత, కాలేజీ విద్యార్ధులు, తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com