ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగులు పడుతున్న దేహాలు..గుండెలు బాదుకుంటున్న బాధితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2019, 01:18 PM

పాపికొండల బోటు ప్రమాదం విషాదానికి విషాదంలా మారుతుంది. ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్న గల్లంతైన వారి మృతదేహాలు లభించక గుండెలవిసేలా రోదిస్తున్నారు బాధితులు. కన్న వారు కట్టుకున్న వారు తలకొరివి పెట్టాల్సిన కొడుకులు.. బోటు ప్రమాదంలో గల్లతయ్యారు. కడసారి చూపు కోసం ఘటన స్థలి వద్ద నాలుగు రోజులుగా బాధిత కుటుంబాలు ఎదరు చూస్తునే ఉన్నాయి. మరో వైపు శవాలుగా దర్శనమిస్తున్న కుటుంబీకుల దేహాలను మార్చురి సిబ్బంది నిర్లక్ష్యంగా పడేయడంతో హృదయ విదారక స్థితిలో శరీరాలు కనిపిస్తున్నాయి. అప్పటికి నీటిలో మునిగి నాలుగు రోజులు కావడంతో ఉబ్బి పోయి గుర్తు పట్టని స్థితికి చేరుకున్న మృతదేహాలను మార్చురి ఐస్ బాక్సుల్లో భద్రపరచకపోవడంతో మృతదేహలు పురుగులు పట్టి దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కుటుంబీకులు గుండెలవిసిపోయేల రోదిస్తున్నారు. శత్రువుకు కూడా రాకుడని చావు వీరికి వచ్చిందే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఓ తల్లి తన కొడుకు శవాన్ని పురుగులు పట్టిన స్థితిలో చూసి అక్కడే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తన కొడుకు ఇలా చూడటానికా నేనింకా బ్రతికి ఉన్నది అంటూ అక్కడే ఉన్న మార్చురి గోడకు తలబాదుకుని కుప్పకూలిపోయింది. 


ఓ ఘటన ప్రభుత్వం ఎలా పని చేస్తుందో చెపుతుంది.. ఓ ప్రమాదం ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో నిర్థారిస్తుంది. ఓ విషాద ఘటన ప్రభుత్వ అధికారుల పని తీరును బట్టబయటు చేస్తుంది. సరిగ్గా ఇక్కడే కంచికచెర్ల బోటు ప్రమాద ఘటన కింది స్థాయి సిబ్బంది తీరును తేటతెల్లం చేసింది. మానవత్వంతో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది ఓపిక నశించో లేక మరో కారణమో కానీ పరిస్థితి మాత్రం మనసున్న మనుషులు చలించిపోయేలా కనిపిస్తోంది. ఓ వైపు ఆప్తులను కోల్పోయిన ఆవేదన వేదిస్తుంటే... ఇంకో వైపు గుర్తుపట్టని స్థితిలో లభ్యమవుతున్న మృతదేహలు కన్నీళ్లకే కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. ఇప్పటికి ఇంకా దొరకని మృతదేహాలు ఎన్నో.. ఆఖరి చూపుకైనా దక్కుతారో లేదోనని ఆతృత నిండిన గుండెలతో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అంతా. 


గోదావరిలో బోటు మునిగిన విషాదంలో గల్లంతయిన వారి మృతదేహాలను వెలికితీసి.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చి, భద్రపరుస్తున్న తీరు వివాస్పదమవుతోంది. మార్చురిలో భద్రపర్చాల్సిన మృతదేహాలను మార్చురి బయట రేకుపై పెట్టి ఉంచడం మరింత కలకలం సృష్టిస్తోంది. ఇలా తమ వారిని చూసి కుప్పకూలుతున్న బంధువుల సంఖ్య పెరుగిపోతోంది. తెలంగాణకు చెందిన పవన్‌కుమార్‌ బోటు ప్రమాదంలో మృతి చెందగా.. పవన్ మృతదేహన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచిన తీరు అక్కడ ఉన్న వారిని కలిసి వేసింది. 


ఇక తెలంగాణకు చెందిన మరో కుటుంబం తన కూతురు చివరి చూపుకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. గత నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లా యువ ఇంజనీర్ రమ్యశ్రీ సమాచారం కోసం తండ్రి సుదర్శన్ ఎదురు చూస్తున్నాడు. అందరి ఆచూకీ తెలుస్తుంది నా బిడ్డ ఆచూకీ మాత్రం చెప్పడం లేదంటే కుమిలికుమిలి ఏడుస్తున్నాడు సుదర్శన్. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆర్నెల్లు గడవక ముందే గోదావరిలో బోటు బోల్తా ఘటనలో కుమార్తె గల్లంతు కావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆ తండ్రి. ఇలా ఒక్క సుదర్శన్ మాత్రమే కాదు దాదాపు మరో 22 కుటుంబీకులు పరిస్థితి ఇదే. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎందరో ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో బోటులోనే ఉండిఉంటారని భావిస్తున్నారు. 


అయితే బోటు బయటకు తీసే అవకాశం లేదని.. ఒడ్డుకు చేర్చే అవకాశం అంతకంటే లేదని.. బరువు ఎక్కువగా ఉండటం 250 అడుగుల లోతులో బోటు ఉండటంతో బోటును పైకి తీసుకురావడం కష్టసాధ్యంగా ఉందని చెపుతున్నారు అధికారులు. దీంతో ఇక తమ వారిని చివరి చూపుకు నోచుకోలేమ అంటూ బాధిత కుటుంబాలు గుండె బద్దలయ్యేలా రోదిస్తుండటం అక్కడున్న ఉన్నతాధికారులను కూడా కలిచి వేస్తుంది. ఈ ఒక్క విషాదం రెండు తెలుగు రాష్ట్రాలను నాలుగు రోజులుగా కన్నీళ్లు పెట్టిస్తునే ఉంది. ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి స్థాయిలో ఫలితం రావడం లేదు. చివరికి గల్లంతయిన వారు ఎందరో కూడా పక్క సమాచారం ఇప్పటికి తేలకపోవడం మరింత విషాదం. ఏదేమైనా పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదు అనుకుంటున్నారు ఈ విషాద వార్త విన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఆ దేవుడు దయతో కడసారి చూపుకైనా నోచుకునే భాగ్యం కనిపించాలని మనసారా కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com