ఏడాదిగా సాగుతోన్న ఇజ్రాయేల్- హమాస్‌ల యుద్ధంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్‌కు ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. తమ దేశం నుంచి సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోలేదని, సంఘర్షణ ముగింపునకు రాజకీయ పరిష్కారమే కీలకమని మెక్రాన్ వ్యాఖ్యనించారు. అంతేకాదు, ఇజ్రాయేల్ పొరపాటు దాని భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని పరోక్షంగా హెచ్చరించారు. అయితే, ఫ్రాన్స్ అధినేత నిర్ణయంపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
గతవారం ఫ్రాన్స్ ఇంటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్రాన్ మాట్లాడుతూ... గాజాపై ఇజ్రాయేల్ దాడుల గురించి ప్రస్తావించారు. ‘రాజకీయ పరిష్కారమే కీలకమని నేను భావిస్తున్నాను.. గాజాలో ఇజ్రాయేల్ పోరాటానికి ఆయుధ సరఫరాలను నిలిపివేస్తున్నాం.. కాల్పుల విరమణకు పిలుపునిచ్చినా ఇజ్రాయేల్ పట్టించుకోవడంలేదు. ఇది ఇజ్రాయేల్ తప్పిదం.. ఆ పొరపాటు దాని భద్రతపై కూడా ప్రభావం చూపుతుందనుకుంటున్నా... యుద్ధం విద్వేషాలకు దారి తీసింది. లెబనాన్ మరో గాజాలా మారకూడదు’ అని మెక్రాన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, లెబనాన్ సరిహద్దుల్లోకి దళాలను పంపాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.
కాగా, ఈ ప్రకటనపై బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో పోరాడుతోన్న ఇజ్రాయేల్‌వైపు ప్రపంచం నిలవాలి. కానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో సహా ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయేల్‌కు ఆయుధాల సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటు.. ఇరాన్ హెజ్బొల్లా, హమాస్, హౌతీలపై ఆయుధ నిషేధం విధిస్తుందా?. అక్టోబరు 7 నాటి దాడుల్లో వేల మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.. ప్రధాన శత్రువు ఇరాన్.. టెహ్రాన్ దాని మద్దతున్న అనేక శక్తులతో మేము పోరాడుతున్నాం.. మేము గాజా, లెబనాన్‌లో పోరాడుతున్నాం. అక్టోబరు 7నాటి దాడిని మించిన మరణకాండకు మా ఉత్తర సరిహద్దుల్లో హెజ్బొల్లా వ్యూహరచన చేసింది. ఈ పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా.. లేకున్నా ఇజ్రాయేల్ మాత్రం యుద్ధంలో గెలిచే వరకు పోరాడుతుంది.’ అని నెతన్యాహు ఓ వీడియోలో పేర్కొన్నారు.
కాగా, నెతన్యాహు ప్రకటనపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ‘ఇజ్రాయేల్‌కు ఫ్రాన్స్ అత్యంత ధృడమైన మిత్రుడు... కానీ, నెతన్యాహు స్పందించిన తీరు ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలను దెబ్బతీసేదిగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. అటు, మెక్రాన్ ప్రకటనపై ఖతార్ హర్షం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ చర్చల్లో భాగస్వామి అయిన ఖతార్.. యుద్ధం ఆపడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్యమైన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొంది. అలాగే, జోర్డాన్ కూడా దీనిని స్వాగతించింది.