దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన కనీసం ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి చెంబూర్ ప్రాంతంలోని సిద్ధార్థ కాలనీలో ఓ రెండంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ భవనంలో నివాసం ఉన్న కుటుంబంలో మంటల్లో చిక్కుకున్నారు.
ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆ కుటుంబంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయానికి బాధితులు గాఢ నిద్రలో ఉండటతో దానిని నుంచి తప్పించుకోలేకపోయారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలను మంటలను అదుపుచేసి.. లోపలి చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స కోసం రాజావాడి ఆసుపత్రికి తరలించామని, కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
రెండంతస్తుల భవనం మొదటి అంతస్తులో బాధిత కుటుంబం నివసిస్తోంది. కింద అంతస్తులో వాళ్లే ఎలక్ట్రిక్ సామాన్లు దుకాణం నిర్వహిస్తున్నారు. తొలుత ఈ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. అవి రెండో అంతస్తుకు విస్తరించాయి. గాఢనిద్రలో ఉన్న బాధితులు ఏం జరుగుతుందో తెలిసేలోగా అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను నరేంద్ర గుప్తా (1), పారీస్ గుప్తా (7), మంజు ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (39, ప్రేమ్ గుప్తా (30), విధి గుప్తా, గీతా గుప్తాలుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం వాటిని బంధువులకు అప్పగించనున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.