ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:58 PM

మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో శనివారం పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ.. అక్కడ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ‘సంవిధాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కులగణన, రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని, రాజ్యాంగ పరిరక్షణకు ఇది చాలా ముఖ్యమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు పార్లమెంటులో బిల్లుల ఆమోదానికి ‘ఇండియా’ కూటమి చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.


ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసి.. ఇప్పుడు వచ్చి ఛత్రపతి శివాజీకి క్షమాపణలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఛత్రపతి భారీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణలు చెప్పిన విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ప్రతిని చూపుతూ.. ఇది శివాజీ ఆలోచనలకు నిదర్శనమని తెలిపారు.


కులగణన చేపట్టాలని అవసరం ఉందని చెప్పారు. కులగణన ద్వారా ప్రతి కులంలో ఎంతమంది ఉన్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఎంతమేర నియంత్రణ ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అవకాశాల తలుపులను మూసేశారని వ్యాఖ్యానించారు. ‘90 మంది సీనియర్ ఐఏఎస్‌ అధికారులు భారత బడ్జెట్‌ను నిర్ణయిస్తున్నారు.. అందులో ముగ్గురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఒక ఆదివాసీ అధికారి మాత్రమే ఉన్నారు. కానీ దేశ జనాభాలో ఓబీసీలు కనీసం 50 శాతం, దళితులు 15 శాతం, ఆదివాసీలు 8 శాతం ఉన్నారు’ అని అన్నారు. కులగణన అనేది లోపాలను గుర్తించే ఎక్స్‌రే లాంటిదని పేర్కొన్నారు.


దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం, సమైక్యతను పెంపొందించే ఒక సిద్ధాంతం ఉందని, అది ఛత్రపతి శివాజీ సిద్ధాంతమని అన్నారు. రెండోది రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే సిద్ధాంతమని కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘వారు శివాజీ విగ్రహాన్ని నిర్మించారు.. అది కొద్దిరోజులకే కూలిపోయింది.. అంటే వారి ఉద్దేశాలు సరిగా లేవని ఈ సంఘటన స్పష్టంచేస్తోంది. శివాజీ విగ్రహాన్ని నిర్మించారంటే.. ఆయన సిద్ధాంతాలనూ పాటించాలి’ అని ఎన్డీయే సర్కారుకు రాహుల్‌ గాంధీ చురకలంటించారు. ‘రామమందిర ప్రారంభోత్సవానికి ఆదివాసీ అయిన రాష్ట్రపతిని అనుమతించరు.. ఇది రాజకీయ పోరాటం కాదు.. ఇది సిద్ధాంతపరమైన పోరాటం’ అని అన్నారు. కాగా, త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. మహాయుతి, మహావికాస్ అఘాడీల మధ్య ఆసక్తికర పోరు నెలకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com