ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరియాణాలో ,,,,కాషాయ పార్టీపై ఆగ్రహంతో జాట్ సామాజిక వర్గం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:42 PM

హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందా? పదేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సత్తా చాటుందా? అనేది మరో మూడు వారాల్లో తేలిపోనుంది. అక్టోబరు 5న హరియాణాలోని మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకుంది. హరియాణా ఎన్నికలపై పలు సంస్థల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100 శాతం కచ్చితమైన సర్వేతో సంచలనం రేపిన కేకే.. హరియాణాలో సర్వే నిర్వహించారు. హరియాణా ప్రీపోల్ సర్వేపై కేకే సంస్థ అధినేత కొండేటి కిరణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో ఎన్నికలు జరగనున్న హరియాాణాలో బీజేపీ ఓటమి ఖాయమని తమ సర్వేలో వెల్లడయ్యిందన్నారు


హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయవకాశాలు 100 శాతం ఉన్నాయని చెప్పారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని సర్వేలో తేలిందని చెప్పారు. ఈ పరిస్థితి కేవలం ఒక్క హరియాణాకు మాత్రమే పరిమితం కాదని, త్వరలో జరగబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. బిహార్, పశ్చిమ్ బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మింగుడుపడని ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో టైటానిక్‌లా దేశంలో బీజేపీ మునిగిపోతున్న నావలా మారిందన్నారు.


హరియాణాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ ఓటమే కాంగ్రెస్‌కి సానుకూల అంశం తప్ప, ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత ఏమిలేదని పేర్కొన్నారు. బీజేపీ కోర్ ఓటు అలాగే ఉందని, తటస్థులను మాత్రం నష్టపోనుందని సర్వేలో తేలిందని వివరించారు. ఎక్కువ పార్టీలు బరిలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ లబ్ది పొందుతుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్‌కు మళ్లుతుందని అంచనా వేశారు.


కాగా, ఆప్ హరియాణాలో కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేదని తెలిపారు. ఆలస్యం కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండకపోవచ్చని అంచనాకు వచ్చినట్టు వివరించారు. రైతులు, జాట్ సామాజిక వర్గం బీజేపీ పట్ల గుర్రుగా ఉందని, వీరు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయగరని అన్నారు. కేవలం 5 శాతం ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని, ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య మెజార్టీకి దరిదాపుల్లో కూడా ఉండదని సర్వేలు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు.


‘జాట్‌లు చాలా కాలంగా బీజేపీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. ఈ సామాజిక వర్గం నుంచే సీఎం అయ్యే సంప్రదాయానికి బీజేపీ తెరదించింది.. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు రైతుల ఆందోళన జాట్ వర్గంలో మరింత ఆగ్రహాన్ని కల్గించింది... అలాగే రెజర్లు ఎక్కువ మంది ఈ వర్గానికి చెందినవారే. వినేశ్ ఫోగట్ వంటి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను అందించిన ఈ వర్గంలో రెజ్లర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరింత ఆగ్రహాన్ని రగిల్చింది.. వినేశ్ ఫోగట్ సహా మరికొందరు క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. ఈ కారణాలన్నీ బీజేపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తాయి’ అని కేకే సర్వే సంస్థ అభిప్రాయపడింది.


రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాలు సహా వివిధ రకాల మౌలిక వసతుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టే బీజేపీ, ఈ రాష్ట్రంలో కూడా గణనీయంగా అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేసింది. గత 50-60 ఏళ్లతో పోల్చితే గత పదేళ్లలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధి ఇక్కడ ఎక్కువ. అయినా సరే ప్రజల్లో అసంతృప్తి ఉందని కేకే సర్వే గుర్తించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com