ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. బరిలో 38మంది

international |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:47 PM

2022లో తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో పతనావస్థకు చేరుకున్న ద్వీపదేశం శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. విదేశీ మారక నిల్వలు అయిపోయి.. నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో కొన్ని నెలల పాటు శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజపక్స కుటుంబాన్ని దేశం నుంచి తరిమేలా చేసిన శ్రీలంకవాసులు.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని శ్రీలంక నెమ్మదిగా ఆ సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు రావడంతో తీవ్ర ప్రాధాన్యం నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు.. శ్రీలంకను ఎలా బయటికి తీసుకువస్తారు, మళ్లీ శ్రీలంకకు పునర్వైభవాన్ని ఎలా తెస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే సవాళ్ల నుంచి బయటికి వస్తున్న శ్రీలంక ప్రజలు.. తమకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 1.7 కోట్ల మంది శ్రీలంకవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు దివాలా తీసిన దశలో ఉన్న శ్రీలంకను మెల్లగా గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే.. మరోసారి పోటీ చేస్తుండగా.. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పోటీలో నిలిచారు. ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 38 మంది పోటీ పడుతున్నారు.


అయితే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్ష పీఠానికి త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘేతోపాటు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ పార్టీ నేత అనుర కుమార దిస్సనాయకే.. సామగి జన బలవేగాయ పార్టీ నేత సాజిత్‌ ప్రేమదాస ప్రధానంగా పోటీలో ఉండటంతో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక శ్రీలంక పతనానికి కారణమని ఆ దేశ ప్రజలు భావించే రాజపక్స కుటుంబం నుంచి నమల్‌ రాజపక్స కూడా అధ్యక్ష పోటీలో నిలిచారు. మహింద రాజపక్స కుమారుడైన నమల్‌ రాజపక్స.. మాజీ ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్స స్థాపించిన ఎస్‌ఎల్‌పీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే నమల్ రాజపక్సకు ఆదరణ కరవైంది.


అయితే శ్రీలంక తదుపరి అధ్యక్షుడు తానే అని ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ధీమాగా ఉన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న సమయంలో అధ్యక్ష పీఠం ఎక్కిన రణిల్‌ విక్రమసింఘే.. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే ఈ సంస్కరణలు అంతర్జాతీయ ద్రవ్యనిధి నిబంధనలకు లోబడి ఉండటంతో.. ప్రజలకు అంత సంతోషాన్ని ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా ఆయన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. తాను తెచ్చిన సంస్కరణలు దేశాన్ని దివాలా అంచున నుంచి కాపాడినట్లు ఇటీవల ఎన్నికల ప్రచారంలో రణిల్‌ విక్రమసింఘే తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.


ఇక ప్రైవేటు సంస్థల ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం శ్రీలంక అధ్యక్ష పోటీలో అనుర కుమార దిస్సనాయకే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తీసుకువచ్చిన అవినీతి వ్యతిరేక నినాదానికి యువత నుంచి భారీ మద్దతు లభిస్తోంది. 2020 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయనకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే రాగా.. విక్రమ సింఘేకు 2 శాతం, అత్యధికంగా ప్రేమదాసకు 25 శాతం ఓట్లు లభించాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో 20 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ప్రేమదాస ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 2020 పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.


మరోవైపు.. ఈసారి జరిగే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు మునుపటి ఎన్నికల కంటే చాలా భిన్నమైనవని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈసారి మైనార్టీ తమిళుల సమస్య ఏ ఒక్కరి ఎన్నికల అజెండాలో లేకపోవడం గమనార్హం. శ్రీలంకలో దాదాపు 1.7 కోట్ల మంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా.. వారి కోసం 13,421 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విక్రమ సింఘే సహా మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రాధాన్యతా క్రమంలో ముగ్గురు అభ్యర్థులకు ఓటర్లు తమ ఓటును వేసే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లు అధికంగా వచ్చినవారు అధ్యక్షులుగా ఎన్నికవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com