బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఆధునిక మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా పని చేసారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్టుతో నిర్మింపబడిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలవడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుండి బిగ్ బి ఫస్ట్ లుక్ ను గురువారం విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా నాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ నాగార్జున గురించి మాట్లాడుతూ... ఈ సినిమాలో నాగ్ ఆర్టిస్ట్ అనీష్ గా కనిపిస్తారని, సినిమాకే ప్రధాన హైలైట్ గా నిలిచే నంది అస్త్రాధికారిగా నాగ్ విశ్వరూపమ్ చూపించారని చెప్పారు. చిన్నప్పుడు తనకు నాగార్జున లాగా అవ్వాలని ఉండేదని, బ్రహ్మాస్త్ర సినిమాకు నాగార్జున పాత్ర హై లైట్ గా ఉంటుందని, సినిమాకు నాగ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పారు. ఈ సినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు.