ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రెజ్లర్‌తో భారత సంతతి బిలియనీర్ పెళ్లి.. ఎలా ప్రేమలో పడ్డారంటే

business |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:41 PM

భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ (33) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి, మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ఎరికా హమ్మండ్‌ (32) ను ఏప్రిల్ 26, శుక్రవారం రోజున ఈజిప్ట్ లోని గ్రేట్ పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి వేడుకలు సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉండాలని కోరుకున్న అంకుర్ జైన్ అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేశారు. దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. ముఖ్యమైన అతిథులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే, డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌తో అంకుర్ జైన్‌కు పరిచయం ఎలా ఏర్పడింది? ఎలా ప్రేమలో పడ్డారంటే?


న్యూయార్క్ నగరంలో మాజీ రెజ్లర్ అయిన ఎరికా హమ్మండ్ రంబుల్ బాక్సింగ్ అనే జిమ్ నిర్వహిస్తున్నారు. అందులోనే ఆమె ఫిజికల్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. అయితే, న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లేవారు. అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు ఎరికా. దీంతో వారి ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది కాస్త ప్రేమగా మారింది.


 అంతరిక్షంలో పెళ్లికి ప్లాన్..


అంకుర్ జైన్ తన పెళ్లిన అంతరిక్షంలో చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఎరికా హమ్మండ్ అందుకు ఇష్టపడకపోవడంతో తన ప్లాన్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాము సంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని, పూల కోసమే 20 వేల డాలర్లు ఎందుకు ఖర్చు చేయాలన్నారు అంకుర్. అది సరైన నిర్ణయం కాదని గతంలో అమెరికన్ వీక్లీ మ్యాగజైన్‌తో పేర్కొన్నారు.


అతిథుల కోసం ప్రైవేట్ జెట్స్..


డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ ఎరికా హమ్మండ్, బిలియనీర్ టెకీ అంకుర్ జైన్ పెళ్లి వేడుకలు దాదాపు వారం పాటు నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల సఫారీ సందర్శనతో మొదలయ్యాయి. ఒక్కో రాత్రికి వారు అక్కడ ఉండేదుకు రూ.2000 డాలర్లు వెచ్చించినట్లు పలు మీడియాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఈ జంట ప్రైవేట్ జెట్ లో ఈజిప్ట్‌కి వెళ్లింది. తమ పెళ్లి కోసం వచ్చే అతిథుల కోసం సైతం ప్రైవేట్ ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశారు. సుమారు 130 మంది అతిథులు ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. ఈజిప్ట్‌లోని 'మాడర్న్ కైరో' థీమ్‌తో మహమ్మద్ అలీ ప్యాలస్‌లో అతిథులకు పార్టీ ఏర్పాటు చేసింది ఈ జంట. బెల్లీ డ్యాన్సులు, ఫైర్ డ్యాన్సుల వంటివి ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ఇన్‌స్టా‌గ్రామ్‌లో తమ అతిథులకు పార్టీ ఇస్తున్న పలు ఫోటోలను షేర్ చేశారు ఎరికా. ఈ ఫోటోల్లో లగ్జరీ మేకప్‌లో కనిపిస్తున్నారు ఎరికా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com