కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా పరాజయాలతో బాధపడుతున్న రజిని అన్నాత్తే ఫ్లాప్ తర్వాత తన కొత్త సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు ఒక స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసారు. అయితే నెల్సన్ డైరెక్షన్లో విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా పట్ల విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందారు. కేజీఎఫ్ 2 చిత్రానికి పోటీగా విడుదలైన బీస్ట్ ఆ చిత్రానికి ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. విజయ్ క్రేజ్, ఫ్యాన్ బేస్ వల్లనే తమిళనాడులో ఫర్వాలేదనిపించుకునే వసూళ్లయినా వస్తున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా బీస్ట్ పరాజయానికి కారణం నెల్సన్ దర్శకత్వ లోపమే అని విమర్శించారు. మరి ఇలాంటి నేపథ్యంలో నెల్సన్ -రజినీకాంత్ కాంబోలో రానున్న మూవీ పట్టాలెక్కుతుందా? లేక ఆగిపోతుందా? అని చర్చలు జరుగుతున్నాయి ఈ రూమర్స్ కు రజిని తనదైన స్టైల్ లో అడ్డుకట్ట వేశారు. నెల్సన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాకు ప్రొఫైల్ ఫోటో గా పెట్టారు. అంటే నెల్సన్ తో తాను చేయబోయే సినిమా ఆగిపోలేదు అనే కదా అర్ధం.
పోతే.. నెల్సన్ దర్శకత్వంలో రజిని చేయబోయే చిత్రం ఆయనకు 169వ చిత్రం అవుతుంది. దీనికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.