ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ సీఈఓ క్వాన్ ఓహ్-హున్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల సరైన కారణాలను ఆయన వెల్లడించలేదు. ఇటీవల అవినీతి కేసులో శాంసంగ్ గ్రూప్ అధినేత జే వై లీ జైలు పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హున్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అలాంటి హున్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. శాంసంగ్ కంపెనీలో చిప్, డిస్ప్లే అధినేతగా హున్ పనిచేస్తున్నారు. కంపెనీకి సంబంధించి రికార్డు క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను అంచనావేస్తున్న సమయంలోనే ఈయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ హున్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటనే విషయం తేలాల్సి ఉంది. మెమరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టీవీల్లో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారిగా ఉన్న శాంసంగ్, ఈ ఏడాది రికార్డు లాభాలను నమోదుచేయబోతుంది.