ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబరులో స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సోషల్ ఆడిట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 06:44 PM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారం స్పందన కార్యక్రమం కింద వచ్చే ఫిర్యాదులను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన స్పందన ఫిర్యాదుల పరిష్కార సొల్యూషన్ పై వర్క్ షాపు జరిగింది. స్పందన ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాన్ని తీసుకుని రావాలని ప్రణాళిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులను సకాలంలో హేతుబద్దమైన రీతిలో పరిష్కరించాలని సంబంధిత కార్యదర్శకులను సిఎస్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చినందున ఈ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం వహించవద్దని ఎక్కడైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యల తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కావున వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు వారి శాఖలకు చెందిన అదికారులు, సిబ్బందికి స్పందన ఫిర్యాదులు పరిష్కారంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సియం సమీక్షిస్తున్నారా లేదా అనేది కాకుండా ప్రతి అధికారి, ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని ప్రతి ఫిర్యాదు పరిష్కారం హేతుబద్ధంగా ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు.  


ప్రస్తుతం స్పందన ఫిర్యాదులు పరిష్కారం ఆశించిన స్థాయిలో ఉన్నట్టు లేదని నివేదికలను బట్టి తెలుస్తోందని ఇకపై ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రజల నుండి వచ్చే స్పందన ఫిర్యాదులు అన్నిటినీ క్రమబద్దమైన రీతిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కార్యదర్శులను ఆదేశించారు.స్పందన ఫిర్యాదులతో పాటు ఉద్యోగులకు సంబందించి వచ్చే ఫిర్యాదులను కూడా ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని అన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు,పధకాల రూపకల్పనలో ముందుంటుందనే పేరుందుని కావున ప్రజా ఫిర్యాదులు పరిష్కారంలో కూడా ఆపేరును నిలబెట్టుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్ స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  చేస్తూ స్పందన ఫిర్యాదులకు సంబంధించి ముఖ్యంగా 12 శాఖలు ద్వారా 92శాతం ఫిర్యాదులు స్పీకరించడం జరిగిందని తెలిపారు.అనగా స్పందన కార్యక్రమం ద్వారా మొత్తం 5లక్షల 70వేల 268 ఫిర్యాదులు రాగా వాటిలో 5లక్షల 26వేల992 ఫిర్యాదులు అనగా 92శాతం భూపరిపాలన, పౌరసరఫరాలు, మున్సిపల్ పరిపాలన, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పోలీస్, విద్యుత్, వ్యవసాయం, పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, పశుసంవర్ధక శాఖలకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు.ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదుల్లో 77శాతం పరిష్కారం కాగా 8 శాతం తిరస్కరించగా, మరో 15 శాతం పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా నుండి 86 వేల716 ఫిర్యాదులు రాగా వాటిలో 80 శాతం పరిష్కరించగా మిగతా 20శాతం పెండింగ్ లేదా తిరస్కరణలో ఉన్నాయని చెప్పారు. అలాగే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 15వేల571 ఫిర్యాదులు రాగా వాటిలో 86శాతం పరిష్కరించగా 14శాతం తిరస్కరణ లేదా పెండింగ్లో ఉన్నాయని వివరించారు.స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై అక్టోబరులో ఎంఆర్ఓ, ఎండిఓలకు జిల్లా స్థాయిలో సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త చెప్పారు.


 


ఈ సమావేశంలో నవరత్నాల అమలు ప్రభుత్వ సలహాదారు శామ్యూల్, సాంకేతిక సలహాదారు లోకేశ్వర్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది, ఆర్పీ సిసోడియా, కె.దమయంతి, బి.రాజశేఖర్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, కార్యదర్శులు యం.రవిచంద్ర, శ్యామల రావు, ఆర్టీజిఎస్ సిఇఓ బాలసుబ్రహ్మణ్యం, పౌరసరఫరాలశాఖ ఇన్ ఛార్జి కార్యదర్శి కె.శశిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com