విశాఖలో ఆటో దారిమళ్లించిన డ్రైవర్ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దోచుకున్నాడు. అన్నమయ్య జిల్లా చినమండెం మండలం ఎగువ బాలాజీపల్లికి చెందిన ఎర్రబోను రెడ్డప్ప ఆటో నడుపుతూ అనకాపల్లి మండలం రామాపురంలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 2న నర్సింగరావుపేటకు చెందిన చవిటిని చిలకమ్మ రాంబిల్లి మండలం పంచదార్లలోని తన కూతురు వద్దకు బయలుదేరింది. అనకాపల్లిలో ఆమె రెడ్డప్ప ఆటో ఎక్కింది.. ఆమె మెడలోని బంగారంపై కన్నేసిన డ్రైవర్ రెడ్డప్ప రేగుపాలెం వైపు ఆటో మళ్లించాడు.
రెడ్డప్ప వేరే దారిలో వెళ్లడంపై చిలకమ్మ ప్రశ్నించగా.. పురుషోత్తపురం వద్ద సామాన్లు ఎక్కించుకుని వెళ్తానని చెప్పాడు. కొత్తలి-ములకలాపల్లి మధ్య ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను భయపెట్టి, గాయపరిచి 3 తులాల గొలుసు లాక్కుని పట్టుకొని పరారయ్యాడు. రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధురాలిని గమనించిన స్ధానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బృందాలుగా గాలించి రెడ్డప్పను గురువారం పట్టుకున్నారు. అతడికి సహకరించిన మరో ఆటో డ్రైవర్, అనకాపల్లి మండలం అచ్చయ్యపేటకు చెందిన బర్నికాన గంగరాజును కొక్కిరాపల్లి కూడలి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఎలమంచిలిలో ఓ మందుల షాపు దగ్గర ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని తీసుకుని ఆటోను గుర్తించారు. పలుచోట్ల నిఘా పెట్టిన పోలీసులు కొక్కిరాపల్లి హైవే వద్ద ఆటోను పట్టుకున్నారు. బంగారం గొలుసును విక్రయిచినట్టు నిందితులు చెప్పడంతో దానికి సంబంధించి రూ.90 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.