ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమహేంద్రవరంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రికార్డ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 08:13 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలంరేపింది. జాతీయ రహదారికి సమీపంలో లాలా చెరువు ప్రాంతంలో ఉన్న దూరదర్శన్‌ కేంద్రం వెనుక చిరుత కనిపించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత సంచారం నిజమేనని తేల్చారు. చిరుత సంచరించినట్లు దూరదర్శన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాజమహేంద్రవరం శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అయితే ప్రస్తుతం చిరుత ఎక్కడుంది.. ఎటువైపు వెళ్లిందని బృందాలు గాలింపు మొదలుపెట్టాయి. డీఆర్‌వో పద్మావతి ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది.


దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగులు సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో.. చిరుత సంచారం బయటపడింది. చిరుత పులి కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది షాకయ్యారు. ఆ చిరుత ఓ పంది వెనుక పడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన రేడియో స్టేషన్ సిబ్బంది.. వెంటనే పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి పందిని వేటాడే దృశ్యాలను వారికి అందజేశారు. ఆ వెంటనే అప్రమత్తమైన అధికారులు దానిని గుర్తించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత సంచారంపై నిఘా పెట్టారు.


ఈ ఘటన గురించి తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.. నియోజకవర్గ ప్రజలను అర్ట్ చేశారు.. వారికి కొన్ని కీలక సూచనలు చేశారు. చిరుత పులి సంచరిస్తోందని.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో ఉంటున్న స్థానికులు ఆందోళనలో ఉన్నారు.. ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనని భయపడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో చిరుత సంచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.


విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యులు భారీ విరాళాన్ని అందజేశారు. ఏకంగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని వారు ప్రకటించారు. నాలుగు రోజులుగా ఎమ్మెల్యే విజయవాడ సింగ్‌నగర్‌లో వరద బాధితులకు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరద బాధితుల పరిస్థితి చూసి మనస్సు చలించిపోయిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల వారందరికీ భరోసా కలిగిందన్నారు. త్వరలోనే తన విరాళం చెక్కును అందజేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com