ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..

national |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 02:20 PM

షార్ట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన వాట్సాప్‌కు అనేక మోడ్‌లు లేదా క్లోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మాడిఫైడ్, క్లోనింగ్ యాప్‌లను అసలు సంస్థలు అధికారికంగా అభివృద్ధి చేయవు. కానీ వీటిలో అనే కొత్త ఫీచర్లు, మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. అయితే వీటి వల్ల డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని వాట్సాప్ ప్రకటించింది. ఇటీవల ఎక్కువ మంది ఉపయోగిస్తున్న అనధికారిక, ప్రమాదకరమైన మోడ్‌లలో FMWhatsapp వాడకం గురించి వాట్సాప్ తమ వినియోగదారులను హెచ్చరిస్తోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్‌కీ (Kaspersky) నివేదిక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.


అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ మోడ్‌ అయిన FMWhatsappలో ఒక ట్రోజన్ మాల్‌వేర్ ఉందని ఈ నివేదిక తెలిపింది. ఇది వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు ప్రకటనలను అక్రమంగా పంపిస్తుంది. డివైజ్‌లలో సేవ్ చేసిన పేమెంట్ మెథడ్స్‌ ఉపయోగించి, కొన్ని రకాల సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని వినియోగదారులను బలవంతం చేస్తుంది. ఈ మోడ్ యాప్ యూజర్ మెసేజ్‌లు, డేటా, OTPలను కూడా దొంగిలించగలదు.


FMWhatsapp అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?


FMWhatsapp అనేది అచ్చం వాట్సాప్‌ మాదిరిగానే అభివృద్ధి చేసిన క్లోనింగ్, మాడిఫైడ్ యాప్. ఆదాయం కోసం ఈ యాప్‌ ప్రకటనలను అందిస్తుంది. అయితే దీనికి సంబంధించిన యాడ్ లైబ్రరీలలో ట్రయాడా ట్రోజన్‌ (Triada trojan) అనే మాల్‌వేర్ ఉందని కాస్పెర్స్‌కీ రిపోర్టు తెలిపింది. FMWhatsappను ఉపయోగించి, హ్యాకర్లు ట్రయాడా ట్రోజన్‌ని యూజర్ డివైజ్‌కు పంపించవచ్చు. ఆ తరువాత ఈ ట్రోజన్ ఫోన్‌లో స్టోర్ చేసిన డేటాను స్కాన్ చేసి, దాన్ని హ్యాకర్ రిమోట్ సర్వర్‌కు చేరవేస్తుంది.


ఈ ట్రయాడా ట్రోజన్.. యూజర్లకు అవసరం లేని అదనపు ట్రోజన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటి ద్వారా హ్యాకర్లు చట్టవిరుద్ధమైన ప్రకటనలను పంపవచ్చు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్‌వేర్, మాల్‌వేర్‌లను రన్ చేస్తూ, వినియోగదారులు తెలియకుండానే పేమెంట్ సేవలను సబ్‌స్క్రైబ్ చేస్తాయి. అందువల్ల FMWhatsapp అనే వాట్సాప్ మోడ్ యాప్‌ను యూజర్లు ఉపయోగించవద్దని కాస్పెర్స్‌కీ సంస్థ సూచిస్తోంది. వీటిలో ఉండే అదనపు ఫీచర్లను చూసి యూజర్లు మోసపోవద్దని కోరింది.


ఇలాంటి యాప్‌లలో ఉండే ప్రమాదకరమైన మాల్‌వేర్‌ల వల్ల వాటిల్లే ముప్పును యూజర్లు అంచనా వేయలేరని కాస్పెర్స్‌కీ నివేదిక పేర్కొంది. అందువల్ల క్లోన్, మాడిఫైడ్ వాట్సాప్‌ యాప్‌లను ఉపయోగించవద్దని హెచ్చరించింది. వినియోగదారులు అధికారిక యాప్‌ వెర్షన్‌లను మాత్రమే ఉపయోగించాలని, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫాంల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com