ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా పండగపై సర్కారు ప్రకటన.. కన్నడనాట రాజకీయ రచ్చ

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 12:09 AM

దసరా పండుగ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటన రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. గతేడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారుకు తొలి దసరాకు కరవు కారణంగా ఇక్కట్లు ఎదురయ్యాయి. సంబరాలు సాధారణంగా నిర్వహించారు. ఈసారి మాత్రం కరువుదీరా వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. దీంతో విజయ దశమి సంబరాలను సిద్దూ సర్కారు జోష్‌ పెంచింది. ఈ వేడుకల కోసం రూ.15 కోట్ల అదనంగా నిధులు కేటాయించింది సిద్ధూ ప్రభుత్వం. ఈ క్రమంలో శుక్రవారం సర్కారు ఇచ్చిన ప్రకటన రాజకీయ విమర్శలకు వేదికయ్యింది. అయితే, వివాదానికి కారణమైన ఆ ప్రకటనలో ఇంతకీ ఏముంది?.


‘దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు దసరా ప్రతీక.. దుష్ట శక్తిపై సత్యానికి విజయం, వక్రమార్గంలో అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించే దుష్ట శక్తులను తల్లి చాముండేశ్వరి నిలువరించి కన్నడ ప్రజలకు సుఖ, శాంతులు అందించాలి’ అనేది ఈ ప్రకటన సారాంశం. అందులోనూ భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపరలో ఒకటైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాజిక అలజడి సృష్టించే వారిని శిక్షించాలన్న ఆశయాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా మండిపడింది.


ముడా కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతో పవిత్రమైన నవరాత్రులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టింది. తన చేతికి అంటిన పాపంతో నవరాత్రులు చేసినా అది రాష్ట్రానికి అరిష్టమని ఆరోపించింది. మరోవైపు, ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. ప్రజలకు ధర్మోపదేశాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పాలనలో ఎలాంటి ధర్మాన్ని అనుసరించిందని నిలదీశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, ప్రహ్లాద్‌ జోషి తదితరులు ఈ పవిత్రమైన పండగను రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు.


అయితే, ఈ ప్రకటన వెనుక సిద్ధరామయ్య సర్కారు ఉద్దేశం ఎలా ఉన్నా.. ప్రస్తుత కన్నడ రాజకీయాల్లో ఏ పార్టీ నాయకుడు నోరు విప్పినా అది అవినీతి, అక్రమాలు, కేసులు, విమర్శలకే పరిమితమవుతూ దసరా ఉత్సవాలను కాస్త రాజకీయ ఉత్సవంగా మారుస్తున్నారు. మరోవైపు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫోటోతో ఏ ప్రకటన ఇచ్చినా.. దానిని ప్రతిపక్షాల రాజకీయ కోణంలో చూస్తుండటం.. ముడా కుంభకోణంతో లింకులు పెట్టి సిద్ధూపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు, అధికార పక్షం కూడా మంత్రివర్గ సమావేశమైనా, మంత్రుల పిచ్చాపాటి సమావేశాలైనా, బెంగళూరుకు వచ్చినా, ఢిల్లీ వెళ్లినా రాజకీయమే తప్ప పాలనాపరమైన ఆలోచన లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com