ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌ బీజేపీలో అసమ్మతి సెగ.. సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 12:07 AM

మధ్యప్రదేశ్ బీజేపీలో అంతర్గత ప్రభుత్వంలో ఒక్కసారిగా అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజీనామా బెదిరింపులు, ఆందోళనలు, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు అధికార పార్టీలో పెరుగుతున్న అసమ్మతికి అద్దం పడుతున్నాయి. ముగ్గురు మాజీ మంత్రులతో సహా ఆరుగురు ప్రముఖ ఎమ్మెల్యేలు ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నారు. ప్రభుత్వ పాలన, నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.


డియోరి ఎమ్మెల్యే బ్రిజ్ బిహారీ పటేరియా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు గురువారం రాత్రి ప్రకటించారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపినట్టు తెలిపారు. పాము కాటు ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించడంతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘నా మాటను కూడా పోలీసులు లెక్కచేయపోతే ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి’ అని వ్యాఖ్యానించారు. కొద్ది గంటల్లోనే ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని.. సమస్య పరిష్కారమైందని సమర్ధించుకోవడం గమనార్హం.


దీనికి ముందు మౌగంజ్ ఎమ్మెల్యే ప్రదీప్ పటేల్.. లిక్కర్ మాఫీయాకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ ఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. తనను గూండాలతో చంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం మరింత అగ్గి రాజేసింది. ఆయనకు మాజీ మంత్రి, పటాన్ ఎమ్మెల్యే అజయ్ విష్ణోయ్ మద్దతు తెలపుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వివాదం మలుపు తిరిగింది. ఆయన ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మద్యం మాఫియాకు తలవంచిందని ఆరోపించారు.


వీరికి తోడుగా మరో ఎమ్మెల్వే వంతపడుతూ.. తన నియోజకవర్గం పేకాట, అక్రమ మద్యానికి అడ్డగా మారిపోయిందని, పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ తన ఆధార్ కార్డును ట్యాంపరింగ్‌కు గురైందన్న ఆయన.. జబల్‌పూర్, కట్నీ, భోపాల్‌లోని తన నివాసాల మద్ద అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారని, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.


మరో మాజీ మంత్రి, గధకోటా ఎమ్మెల్యే గోపాల్ భార్గవ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ‘సమాజం సిగ్గుతో తలదించుకునేలా అత్యాచార ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితులలో రావణుడిని దహనం చేయడానికి మనం అర్హులమని చెప్పగలమా? పునరావృతమవుతోన్న ఈ క్రూరమైన నేరాలు, మనస్సాక్షిని కించపరుస్తూనే ఉన్నాయి మా అక్కచెల్లెళ్లు,కుమార్తెలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో మేం విఫలమవుతున్నాం’ అని ధ్వజమెత్తారు.


కాగా, ఈ పరిణామాలను బీజేపీ తక్కువ చేసేందుకు ప్రయత్నించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అధికార పార్టీలో అంతర్గత పోరుకు ఇది తార్కాణమని ఆరోపిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ మాట్లాడుతూ.. ‘ఏ కుటుంబంలోనైనా సభ్యుల మధ్య స్పర్దలు సహజం.. బీజేపీ క్రమశిక్షణతో పనిచేస్తుంది.. అంతా అదుపులో ఉంటుంది.. అంతా బాగానే ఉందని పటేరియా జీ ఒక్క నిమిషంలో స్పష్టం చేశారు’ అని తెలిపారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ నాయక్ మాట్లాడుతూ,.. ‘ఇంతకుముందు, మేము ఈ సమస్యలను లేవనెత్తినప్పుడు, బీజేపీ పరువు తీస్తున్నామని వీడీ శర్మ ఆరోపించేవారు. ఇప్పుడు, వారి పార్టీకి చెంది డజను మంది ఎమ్మెల్యేలు అదే ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు?’ అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com