ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కూటమిలోకి పాకిస్థాన్ చిరకాల మిత్రదేశం.. టర్కీ వైఖరిలో అనూహ్య మార్పు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 10:18 PM

2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి.. ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కశ్మీర్ గురించి ప్రస్తావిస్తోన్న టర్కీ.. తాజాగా తన వైఖరికి భిన్నంగా వ్యవహరించింది. ఈ ఐదేళ్లలో తొలిసారి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన ఐరాస (UNO) ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. పాకిస్థాన్‌కు బలమైన మిత్రదేశంగా ఉన్న టర్కీ.. ఇస్లామాబాద్‌ను మెప్పించడం కోసం కశ్మీర్‌ విషయంలో భారత్‌ను తప్పుబట్టడం గత కొన్నేళ్లుగా సాధారణంగా మారింది. అయితే ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా కశ్మీర్ అంశాన్ని పక్కనబెట్టింది.


2018 నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టర్కీ.. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్రిక్స్ వైపు ఆశగా చూస్తోంది. భారత్ కీలక సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలో చేరేందుకు టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్‌‌ను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యూహాత్మకంగానే ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురాలేదని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో ప్రసంగించిన ఎర్డోగాన్.. తాము బ్రిక్స్‌ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు.


బ్రిక్స్ కూటమి..


2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ కూటమిగా ఏర్పాటయ్యాయి. 2010లో సౌతాఫ్రికా చేరికతో అది బ్రిక్స్‌గా మారింది. పశ్చిమ దేశాలకు చెందిన జీ7 కూటమికి ప్రత్యామ్నాయంగా దీన్ని పరిగణిస్తుంటారు. తమ కూటమిలోకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ దేశాలను ఆహ్వానించాలని బ్రిక్స్‌లో సభ్యదేశాలు గత ఏడాది నిర్ణయించాయి. అయితే టర్కీ తన అవసరాల దృష్ట్యా రష్యా, చైనా సాయంతో బ్రిక్స్‌లో చేరాలని ప్రయత్నిస్తోంది.


టర్కీ.. ఆసియా, యూరప్ మధ్య వారధి:


8.5 కోట్ల జనాభా ఉన్న టర్కీ.. ప్రపంచంలో 19వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ దేశం భౌగోళికంగా ఆసియా, యూరప్‌ ఖండాలకు మధ్యలో ఉంటుంది. యూరప్‌తో ఉన్న దీర్ఘకాలిక సంబంధాల కారణంగా.. యూరోపియన్ యూనియన్లో చేరాలని మొదట్లో టర్కీ భావించింది. కానీ ఈయూ మాత్రం దశాబ్దాలుగా ఎటూ తేల్చడం లేదు. దీంతో టర్కీ చూపు బ్రిక్స్ కూటమి వైపు పడింది. టర్కీ ఇప్పటికే నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశంగా ఉంది. ఒక వేళ టర్కీ గనుక బ్రిక్స్‌లో చేరితే.. ఈ కూటమిలో చేరిన తొలి నాటో సభ్య దేశం అవుతుంది.


భారత్ ఓకే చెబితేనే.. టర్కీ చేరేది..


టర్కీ బ్రిక్స్ చేరాలని ఉబలాటపడుతున్నప్పటికీ.. ఆ దేశాన్ని చేర్చుకునే విషయమై బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఇప్పటి వరకూ చర్చ జరగలేదు. కూటమిలోకి టర్కీ చేరికకు ఇండియా కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. భారత్, చైనా, రష్యా లాంటి బలమైన దేశాలున్న కూటమిలో చేరడం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని టర్కీ భావిస్తోంది. అయితే పశ్చిమ దేశాలను నొప్పించొద్దనే ఉద్దేశంతో.. యూరోపియన్ యూనియన్, నాటోకు బ్రిక్స్‌ ప్రత్యామ్నాయమని తాము భావించడం లేదని టర్కీ చెబుతోంది.


అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్‌లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ఈజిప్ట్ అధ్యక్షుడు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 23న ఎర్డోగాన్‌తో సమావేశమవుతానంటూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. టర్కీ పార్లమెంట్ స్పీకర్ నుమన్ కుర్టుల్‌మస్ ఇటీవల మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరలో బ్రిక్స్ కూటమిలో చేరతామనే ఆశాభావం వ్యక్తం చేశారు.


పాక్‌తో దోస్తీ..


టర్కీ సెక్యులర్ దేశమైనప్పటికీ.. ఇస్లాం ప్రభావం ఎక్కువ. టర్కీకి మొదటి నుంచి పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. టర్కీ, పాక్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. పాక్ సైన్యం దగ్గరున్న డ్రోన్లు, సబ్‌మెరైన్లను టర్కీ ఆధునికీకరిస్తోంది. పాక్‌తో స్నేహం.. భారత్, టర్కీ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. టర్కీ శత్రుదేశాలైన ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్‌లకు భారత్ మద్దతునిస్తూ వస్తోంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు సైతం బలోపేతం అయ్యాయి.


భారత వ్యతిరేక వైఖరి..


2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. అంతర్జాతీయ వేదికలపై టర్కీ ఇండియాకు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలుపెట్టింది. తమ దేశానికి సంబంధం లేకుండా.. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ ఏర్పాటు ప్రతిపాదనను సైతం టర్కీ వ్యతిరేకించింది.


భారత్ ఆపన్నహస్తం..


అయితే టర్కీతో మంచి సంబంధాలే కొనసాగించేందుకు భారత్ మొగ్గు చూపుతోంది. 2023 ఫిబ్రవరిలో భారీ భూకంపం టర్కీని కుదిపేసిన సమయంలో.. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, డాగ్ స్క్వాడ్, అత్యవసర ఔషధాలను పంపించి టర్కీకి పంపించింది. క్షతగాత్రులకు చికిత్స అందించడం కోసం భారత సైన్యం టర్కీలో ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌ను సైతం ఏర్పాటు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com