ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య దేశంగా భారత్.. కీలక ముందడుగు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 10:20 PM

దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న పోరాటంలో ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గత కొన్నేళ్లుగా.. ఐక్యరాజ్యసమితిని విస్తరించాల్సిన అవసరం ఉందని.. అందులో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తరచూ ఈ అంశాలను లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశాలు కూడా భారత్‌కు శాశ్వత హోదా కల్పించేందుకు మద్దతు తెలుపుతుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత శాశ్వత సభ్యత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్.. భారత్‌ చేస్తున్న వాదనకు మద్దతు పలికారు.


అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి కైర్‌ స్టార్మర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌తోపాటు బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ లాంటి దేశాలకు కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా స్థానం ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫ్రికా నుంచి 2 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కైర్ స్టార్మర్ సూచించారు. ఈ విధంగా ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సరిపడా సభ్యదేశాలు లేనంతవరకు ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భద్రతామండలిని మరింత పటిష్టం చేయడానికి.. అందులోని శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచాలని స్టార్మర్‌ వివరించారు.


ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ను శాశ్వత సభ్య దేశంగా చేసేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌లు మద్దతు పలికారు. తాజాగా బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా సపోర్ట్ చేయడంతో.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు సభ్య దేశంగా స్థానం లభించేందుకు మార్గం సుగమం అయింది.


ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా భద్రతామండలి ఏర్పడి 75 ఏళ్లు దాటిపోయింది. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌.. ఈ 5 దేశాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇక మిగితా 10 తాత్కాలిక సభ్య దేశాలుగా.. రొటేషన్‌ పద్ధతిలో మారుతూ వస్తున్నాయి. ఇక గత కొన్ని దశాబ్దాల నుంచి.. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా 5 దేశాల్లో చైనా మినహా మిగిలిన 4 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక్క చైనా మాత్రమే భారత్‌కు శాశ్వత సభ్య దేశం కాకుండా అడ్డుతగులుతూనే ఉంది.


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం భారత్‌కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలకు మాత్రమే ప్రత్యేకంగా వీటో అధికారం ఉంటుంది. భద్రతా మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను.. ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా.. ఆ నిర్ణయం వీగిపోతుంది. ఈ క్రమంలోనే శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మినహా మిగిలిన 4 దేశాలు మద్దతు తెలిపినా.. భారత్‌కు శాశ్వత హోదా రావడం లేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com