ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపట్నుంచే పార్లమెంటు.. రాహుల్‌కు ఎడిటర్ గిల్డ్ లేఖ

national |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 11:13 PM

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 23 వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు.. 6 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా సిద్ధంగా ఉంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజీ, వరుస రైలు ప్రమాదాలు, ఇతర అంశాలపై నరేంద్ర మోదీ సర్కారును ఎండగట్టేందుకు ప్రతిపక్షం రెడీ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ప్రభుత్వ వాటాను 51 శాతం కన్నా తక్కువకు తగ్గించుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీకి పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని ఎడిటర్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది.


సార్వత్రిక ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున 2024-2025 ఆర్థిక ఏడాదిలోని మిగిలిన 8 నెలల కాలానికి మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. ఇక ఇదే సమావేశాల్లో ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు, 1934 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ - 2024 బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ (ప్రమోషన్, అభివృద్ధి)బిల్లు, రబ్బరు (ప్రమోషన్, అభివృద్ధి) బిల్లులు ఉన్నాయి.


ఈ క్రమంలోనే దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా శాసన ప్రక్రియ ద్వారా మీడియా రంగాన్ని నియంత్రించడానికి, పరిమితులు విధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఆరోపించింది. మీడియా స్వేచ్ఛ, సమాచార హక్కులను కాపాడుకోవడానికి మద్దతుగా నిలవాలని.. ఇలాంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని కోరుతూ లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాసింది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్, ప్రసార సేవల నియ్రంతణ బిల్లు, ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పిరియాడికల్స్‌ యాక్ట్, ఐటీ రూల్స్‌-2021 సహా పలు సవరణలపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.


మరోవైపు.. పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకునేందుకు రాజ్యసభలో సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై బులెటిన్‌ విడుదలైంది. సభాధ్యక్షుడి రూలింగ్స్‌ను సభ్యులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. పార్లమెంటు లోపల, బయట విమర్శించకూడదని అందులో వెల్లడించింది. ఇక సభ లోపల వందేమాతరం, జైహింద్‌ వంటి నినాదాలు ఇవ్వరాదని.. ప్లకార్డులు కూడా ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. రాజ్యసభలోకి ప్రవేశించేటపుడు.. బయటికి వెళ్లేటపుడు.. ప్రతీ సభ్యుడు అధ్యక్ష స్థానానికి తల వంచి అభివాదం చేయాలంటూ రాజ్యసభ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్‌ బుక్‌లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com