ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెబనాన్‌‌లో పేలుళ్ల వెనుక సైబర్ దాడి.. ఇంతకీ ఏంటీ ‘పేజర్ బాంబులు’?

international |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:28 PM

లెబనాన్‌లో వేల సంఖ్యలో పేజర్లు ఒక్కసారిగా పేలిన ఘటనలో 9 మంది చనిపోగా... అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పేజర్లను పేల్చేసినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఇంతకీ ఈ పేజర్లు ఏంటి? అనేది నేటిజన్లు తెగ శోధిస్తున్నారు. పేజర్లు అనేవి సెల్‌ఫోన్లు రాక ముందు సమాచారం అందజేయడానికి వినియోగించేవారు. 2000వ దశకం మొదట్లో ప్రయివేట్, ఫిక్స్డ్ లైన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థగా ఇవి ఉపయోగపడ్డాయి. సెల్‌ఫోన్‌ అంత పరిమాణంలో ఉండే వీటి ద్వారా అవసరమైన వారికి సమాచారం చేరవేయవచ్చు. ట్రాన్స్‌మీటర్ల మాదిరిగా పనిచేసే ఈ పరికరం ద్వారా అవసరమైన సమాచారాన్ని అవతలి వ్యక్తికి పంపొచవ్చు.


ఈ పేజర్లలో అనేక రకాలు ఉంటాయి. కొన్ని పేజర్ల ద్వారా నంబర్లను మాత్రమే పంపే వీలుంటే, మరికొన్నింటి ద్వారా నంబర్లు, టెక్స్ట్‌ను పంపొచ్చు. కొన్ని పేజర్ల ద్వారా వాయిస్ మెసేజ్‌లను సైతం పంపించొచ్చు. రెస్పాన్స్ పేజర్లు.. తమకు సందేశం వచ్చిందని ధ్రువీకరించగలవు. కానీ టూవే పేజర్ల ద్వారా సందేశాలకు బదులివ్వడంతోపాటు.. మెసేజ్‌లను ఫార్వార్డ్ కూడా చేయొచ్చు. పేజర్లు ట్రాన్స్‌మీటర్ల వ్యవస్థ ఆధారంగా పని చేస్తాయి. తక్కువ శక్తివంతమైన ట్రాన్స్‌మీటర్ సాయంతో ఈ పేజర్లను నిర్దేశిత ప్రదేశంలో వాడొచ్చు. వేలాది హై పవర్ బేస్ స్టేషన్లను ఉపయోగించి దేశవ్యాప్తంగానూ పేజర్లను వాడుకోవచ్చు.


ఈ పేజర్ల ద్వారా సందేశం పంపేటప్పుడు ప్రత్యర్థులు ట్రాక్ చేయడానికి వీలుపడదు. తమ సంభాషణలు ఎవరూ వినకుండా లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్ వీటిని ఎక్కువగా వాడుతోంది. పేజర్ల పేలుళ్లలో హెజ్బొల్లా ముఖ్య నేతలు, సలహాదారులు గాయపడటం, దాదాపుగా ఆ పరికరాలు అన్నీ ఒకేసారి విస్ఫోటనం చెందడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్‌తోనే జరిగినట్టు అనుమానిస్తున్నారు.


ఇటువంటి రహస్య ఆపరేషన్లలో దిట్ట అయిన ఇజ్రాయేల్‌ గూఢచర్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. హెజ్బొల్లాకు లెబనాన్‌లో సొంతంగా కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఈ గ్రూప్ టెలికం నెట్‌వర్క్‌లోకి ఇజ్రాయేల్‌ గూఢచర్య సంస్థలు చొరబడి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అక్టోబరు నుంచి జరుగుతోన్న టార్గెట్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్లు చాలా మంది హత్యకు గురికావడమే ఇందుకు కారణం. కాగా, ఈఘటనపై ఇజ్రాయేల్‌ ఇంకా స్పందించలేదు. ఈ దాడి ఎలా జరిగి ఉంటుందన్నదానిపై భిన్న వాదనలు వ్యాప్తిలో ఉన్నాయి.


కొందరు మాత్రం పేజర్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు ఉంచడం లేదా ఈ పరికరం మాదిరిగా ఉండే మినీ బాంబులను అమర్చి ఉంటారని చెబుతున్నారు. హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా గతంలో గ్రూప్ సభ్యులను సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. వారి కదలికలను ట్రాక్ చేయడానికి, దాడులకు ఇజ్రాయేల్ వాటిని ఉపయోగించవచ్చని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్‌లు, కంప్యూటర్‌ల హ్యాకింగ్‌లో అత్యంత అధునాతనమైనవిగా పెగాసిస్ వంటి ఇజ్రాయేల్ సాంకేతికతకు గుర్తింపు ఉంది. హెజ్బొల్లా పేజర్లను ఎక్కువగా వాడుతోంది. ఇవి కూడా ఇజ్రాయేల్‌కు లక్ష్యంగా మారాయి. ఇప్పుడు పేలిన పరికరాలన్నీ కొత్త మోడళ్లేనని కథనాలు పేర్కొంటున్నాయి. అవన్నీ గత కొద్దినెలల్లో ఇరాన్‌ నుంచి లెబనాన్‌లోకి వచ్చాయని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com